మలి దశ పోరాటానికి కేసీఆర్ రెడీనా ?
ఇక కేసీఆర్ రాజకీయ జీవితం అన్నది తెరచిన పుస్తకమే. ఆయన కాంగ్రెస్ లోనే తన రాజకీయాన్ని ప్రారంభించారు.;
ఏడు పదుల వయసులో కేసీఆర్ ఉన్నారు. షార్ట్ కట్ లో కేసీఆర్ అయినా 2001 వరకూ ఆయన అందరికీ తెలిసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలుగుదేశంలో పాత మిత్రులు అంతా ఆయనను అలాగే పిలుస్తారు, అలాగే గుర్తుంచుకుంటారు. ఇక కేసీఆర్ తాజా పుట్టిన రోజుతో 72 ఏళ్ళు పూర్తి చేసుకుని 73వ పడిలోకి అడుగుపెట్టారు. కేసీఆర్ గురించి చెప్పాలీ అంటే ఎన్నో విశేషణాలు ముందు రాయాల్సిందే. ఆయన మంచి వ్యూహకర్త. అపర చాణక్యుడు, రాజకీయ చతురత కలిగిన వారు. ఇలా చాలా ఉన్నాయి.
కాంగ్రెస్ లో నుంచి :
ఇక కేసీఆర్ రాజకీయ జీవితం అన్నది తెరచిన పుస్తకమే. ఆయన కాంగ్రెస్ లోనే తన రాజకీయాన్ని ప్రారంభించారు. యువజన కాంగ్రెస్ నేతగా ఆయన పనిచేశారు. ఇక 1985లో టీడీపీ నుంచి తొలిసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఎన్టీఆర్ మంత్రివర్గంలో సహయ మంత్రిగా 1987 నుంచి 1988 దాకా ఏడాది పాటు మంత్రిగా పనిచేశారు. తిరిగి చంద్రబాబు ప్రభుత్వంలో 1997 నుంచి రెండేళ్ల పాటు మంత్రిగా కేబినెట్ ర్యాంక్ హోదాలో పనిచేసారు. ఇక టీఆర్ఎస్ ని 2021లో స్థాపించిన కేసీఆర్ 2004 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 2004 నుంచి 2006 దాకా రెండేళ్ల పాటు కేంద్ర మంత్రిగా కేబినెట్ ర్యాంక్ హోదాలో పనిచేశారు. అలాగే తెలంగాణాను సాధించి తొలి ముఖ్యమంత్రిగా రికార్డు స్థాపించారు. వరుసగా రెండోసారి కూడా గెలిచి ఏకబిగిన తొమ్మిదిన్నరేళ్ళ పాటు పనిచేసిన సీఎం గా పేరు తెచ్చుకున్నారు.
మలి విడతతో దూకుడు :
కేసీఆర్ మలి విడత తెలంగాణా ఉద్యమాన్ని దూకుడుగా నడిపించారు. ఆయన సారధ్యంలో ఏకంగా 13 ఏళ్ల పాటు తెలంగాణా పోరాటం సాగింది. చివరికి అది 2014 ఫిబ్రవరి నెలలో తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడంతో రాష్ట్రం కల సాకారం అయింది. అలా మలి దశ కేసీఆర్ కి ఎంతగానో అచ్చి వచ్చింది. తొలిదశలో చెన్నారెడ్డి సహా ఎందరో ప్రముఖులు 1969 ప్రాంతంలో తెలంగాణా రాష్ట్రం కోరుతూ ఉద్యమించినా దక్కని ఫలితాలు కేసీఆర్ ఎలా సాధించారు అంటే ఆయన వ్యూహ చతురతతోనే అని అంటారు.
ఈసారి పార్టీ కోసం :
ఇక కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యాక 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓటమి పాలు అయింది. గత రెండేళ్ళుగా ప్రతిపక్షంలో పార్టీ ఉంది. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్ లోనే ఉంటూ వస్తున్నారు. ఆయన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మేనల్లుడు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీని నడిపిస్తున్నారు. అసెంబ్లీ లోపలా బయటా పార్టీకి జోరుని జోష్ ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ కి అంత అనుకూలత అయితే దక్కడం లేదు. ఈ నేపధ్యంలో కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావాలని అంతా కోరుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్ అయితే కేసీఆర్ జనంలోకి వస్తేనే గులాబీ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని అంటున్నారు.
కేసీఆర్ వ్యూహం ఏమిటి :
కేసీఆర్ అయితే గత ఏడాది చివరిలో ప్రెస్ మీట్ పెట్టారు. తాను కొత్త సంవత్సరం నుంచి జనంలో ఉంటారు అని ప్రకటించారు. ఇక జనంతోనే అని కూడా చెప్పారు. కానీ రెండు నెలలు కొత్త ఏడాదిలోనూ గడచిపోయాయి కానీ కేసీఆర్ అయితే బయటకు రావడం లేదు, ఈలోగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అలాగే పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు సైతం ముగిసాయి. కాంగ్రెస్ మంచి విజయాలు నమోదు చేసింది. మరి కేసీఆర్ వ్యూహం ఏమిటి ఆయన ఎంచుకున్న ముహూర్తం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అయినపుడు ఆయన వయసు 31 ఏళ్ళు, మలిదశ తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించినపుడు 47 ఏళ్ళు. కానీ ఇపుడు ఆయన ఏజ్ 72 ఏళ్ళు. ఈ వయసులో ఆయన మళ్ళీ జనంలోకి రావాలి గులాబీ పార్టీకి ఉత్తేజం తీసుకుని రావాలి అన్నది అంతా కోరుతున్నారు కేసీఆర్ కి ఇది ఒక విధంగా అసలు సిసలు పరీక్ష. మరి ఈ పరీక్షని ఏ విధంగా పెద్దాయన ఎదుర్కొంటారు అన్నది చూడాల్సి ఉంది.