ఈ నెలాఖరుకు లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్లేనా?

Update: 2021-06-09 05:30 GMT
అంచనాలకు తగ్గట్లే తెలంగాణలో తాజాగా లాక్ డౌన్ ను సడలించారు. మొన్నటివరకు ఉదయం 10 గంటలకు మొదలయ్యే లాక్ డౌన్ ను మధ్యాహ్నం రెండు గంటలకు.. తాజాగా మరో ఐదు గంటలు పెంచి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కఠినంగా లాక్ డౌన్ అమలవుతుందని స్పష్టం చేశారు. మరో పది రోజుల పాటు ఈ కొత్త విధానం అమలు కానుంది. ఆ తర్వాత పరిస్థితిని మరోసారి రివ్యూ చేసి.. నిర్ణయం తీసుకోనున్నారు.

తాజాగా మార్పులు చేసి విధిస్తున్న లాక్ డౌన్ మరో పది రోజులు అమలు చేయనున్నారు. అంటే.. ఈ నెల 20 వరకు అమలవుతుంది. మరి.. ఆ తర్వాతేం అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 20 తర్వాత నుంచి నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూను యథావిధిగా అమలు చేస్తారని చెబుతున్నారు. కాకుంటే రాత్రి తొమ్మిది గంటల వరకు పొడిగింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

జులై మొదటి వారంలో మాత్రం కర్ప్యూను.. లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేస్తారని.. మాల్స్.. సినిమా థియేటర్లతో పాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇస్తారని చెబుతున్నారు. అంటే.. జులై మొదటి వారానికి పాత పరిస్థితులు నెలకొనే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య తగ్గుతుండటం.. వ్యాక్సిన్ల జోరు పెరుగుతున్న వేళ.. పరిస్థితి మరింత మెరుగుపడే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News