ఒకే దెబ్బకు మూడు పిట్టలా ?

Update: 2021-02-22 16:30 GMT
కేసీయార్ వ్యూహాలు ఇలాగే ఉంటాయి. తొందరలో జరగబోయే హైదరాబాద్ పట్టభద్రుల ఎంఎల్సీ నియోజకవర్గం ఎన్నికలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవిని అభ్యర్ధిగా కేసీయార్ ఎంపిక చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి టీఆర్ఎస్ కు హైదరాబాద్ పట్టభద్రలు నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నిక గెలుపు అందని ద్రాక్షపండులాగ ఉండిపోయింది.

తొందరలో జరగబోయే ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న వ్యూహంతో కేసీయార్ వాణీదేవిని ఎంపిక చేశారు. వాణీదేవి ఎంపిక విషయంలో కేసీయార్ కు మూడు ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. మొదటిదేమో పీవీని చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవమానించిన విషయాన్ని జనాలకు గుర్తుచేయటం. రెండోది పీవీ సామాజికవర్గమైన బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించటం. మూడోదేమో కుల, మతాలకు అతీతంగా ఉన్న పీవీ అభిమానుల ఓట్లను సాధించటం.

నిజానికి వాణీదేవి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలన్నా అవకాశాలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే తెలంగాణాలో నానా అవస్తలు పడుతోంది. ఇక ఆ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుపు విషయంలో ఎవరికీ భరోసా లేదు. సరిగ్గా ఈ పాయింట్ మీదే కేసీయార్ దృష్టి పెట్టారు. పీవీ కూతురును తాము ఆధరించి ఎంఎల్సీ ఎన్నికల్లో నిలబెడుతున్నాం కాబట్టి ఆమెను ఓటర్లు గెలిపిస్తారనే భావన కేసీయార్లో ఉన్నట్లుంది.

అయితే కాంగ్రెస్ తరపున చిన్నారెడ్డి, టీడీపీ తరపున రమణ, బీజేపీ తరపున రామచందర్ రావు పోటీలో ఉన్నారు. మరి ముగ్గురు గట్టి అభ్యర్ధులను తట్టుకుని వాణీదేవి గెలుస్తారా ? ఏమో చూడాలి. ఇపుడు వివిధ వర్గాల్లో కేసీయార్ పాలనపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఆమెను ఏవో లెక్కలేసుకుని కేసీయార్ రంగంలోకి దింపుతున్నారు. చూద్దాం గెలిస్తే కేసీయార్ చతురతని ఓడిపోతే పీవీ కుటుంబాన్ని తెలంగాణా ఆధరించలేదని చేతులు దులిపేసుకోవచ్చు. చూద్దాం ఏమి జరుగుతుందో.


Tags:    

Similar News