రైతుల‌కు మ‌రో తీపి క‌బురు చెబుతాన‌న్న కేసీఆర్

Update: 2020-05-29 10:30 GMT
కాళేశ్వ‌రంలో కీల‌క అడుగు ప‌డింది. ఆ ప్రాజెక్టులోని కీల‌క రిజ‌ర్వాయ‌ర్ అయిన కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్‌ను ప్రారంభించిన ఆనందంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఉన్నారు. ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఆ గోదావ‌రి నీటి ప‌ర‌వ‌ళ్లు చూసి ప‌రామ‌నందం చెందిన ప‌రిస్థితుల్లోనే రైతుల‌కు ఓ తీపి క‌బురు చెబుతాన‌ని ప్ర‌క‌టించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు మ‌రో ప‌థ‌కం ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. రైతుల కోసం అతి త్వరలో మరో అద్భుత పథకం ప్రకటించనున్నట్లు వెల్ల‌డించారు. ఆ పథకం ప్రకటనతో దేశమే ఆశ్చర్యపోతుందని కేసీఆర్ భావించారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కూక్‌లో శుక్రవారం (మే 29) కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల త్యాగాలు వెల‌క‌ట్ట‌లేవ‌ని, వారికి ధ‌న్య‌వాదాలు, కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా అలాంటి రైతుల కోసం తాను ఓ ప‌థ‌కం ప్రకటించనున్న‌ట్లు, కొత్త పథకం వివ‌రించారు. పథకం అమలుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని.. లెక్కలన్నీ తేలిన వెంటనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ విష‌య‌మై వారం రోజుల్లో కొత్త పథకం ప్రకటిస్తామని చెప్పారు. అంతవరకు సస్పెన్స్ కొనసాగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

కొండపోచమ్మ సాగర్‌తో పాటు కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. నిర్వాసితుల కోసం గజ్వేల్ పట్టణంలో 600 ఎకరాల్లో కొత్త పట్టణం నిర్మితమవుతోందని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూమి కేటాయించిన రైతు కుటుంబాలకు ఇంటికి ఒకరి చొప్పున ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు.
Tags:    

Similar News