అమరావతి భూదందాపై సుప్రీంలో కేసు?

Update: 2016-03-14 05:47 GMT
ఏపీ రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారంలో విపక్ష వైసీపీ సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అసెంబ్లీలో దీనిపై టీడీపీని ఎంగడట్టిన ఆ పార్టీ ఇక న్యాయపోరాటానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుని ప్రొసీడవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఈ భూదందాపై సిబిఐ విచారణ చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏపి ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్ మోహన్‌ రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎదురుదాడి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీ ఆరోపణ లకు ఆధారాలు చూపి రుజువుచేయండి, సిబిఐ విచారణ అవసరంలేదంటూ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేస్తారని టాక్.
   
ఏపి నూతన రాజధానికి భూ సేకరణ సమయంలో తొలినాళ్లలో ఆయా పరిసర ప్రాంతాల రైతుల నుంచి పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణ ప్రాంతాలలో రైతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాడు పరామర్శించిన విషయం తెలిసిందే. అమరావతి చుట్టూ సిఎం - ఆయన తనయుడు - కేబినేట్ మంత్రుల బినామీలు పెద్ద ఎత్తున్న ముందస్తుగా భూములు కొనుగోలు చేశారని, ఆ భూములు కొనుగోలు చేశాకే అక్కడ రాజధాని నిర్మాణం ప్రకటన టిడిపి సర్కార్ చేసిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సర్కార్‌ పై రైతుల్లో ఉన్న ఈ వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా మల్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, ఇందుకోసం న్యాయ నిపుణు లతో ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌ రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. అమరావతి వ్యవహారంలో కోర్టుల వరకు వెళ్లి పోరాడితే ప్రజల్లో మైలేజి వస్తుందన్నది జగన్ ఆశగా తెలుస్తోంది.
Tags:    

Similar News