అమరావతిలో గ్రామాలూ హైటెక్కే

Update: 2015-11-26 11:05 GMT
అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 29 గ్రామాలనూ కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. పట్టణాలు - నగరాల్లో ఉండే సదుపాయాలు ఇక్కడికి రానున్నాయి. తాగునీటి సరఫరా - వృథా జలాల శుద్ధి - చక్కటి రహదారులు - మురుగునీటి పారుదల తదితర వ్యవస్థలను అత్యాధునికంగా ఏర్పాటు చేయనుంది. అమరావతిలోనే కాదు.. సమీప గ్రామాల్లో కూడా టెలిఫోన్ కేబుళ్లు - విద్యుత్తు లైన్లు - డ్రయినేజీ - గ్యాస్ - మంచినీటి పైపు లైన్లు ఇలా అన్నీ భూగర్భంలోనే ఉండనున్నాయి.

రాజధాని పరిధిలోని 29 గ్రామాలను మూడు యూనిట్లుగా విభజించింది. ఒక్కో గ్రూపులోనూ పది గ్రామాలు ఉండనున్నాయి. మందడం, అనంతవరం, నెక్కొల్లు కేంద్రాలుగా ఏర్పడిన యూనిట్లలో మందడం కేంద్రంగా ఏర్పడిన కేంద్రంలో సర్వే త్వరలో ప్రారంభం కానుంది. మిగిలిన రెండిట్లోనూ ఇప్పటికే ప్రారంభమైంది. ఆయా గ్రామాల భౌగోళిక స్వరూపం - వీధి దీపాలు - తాగునీటి సరఫరా - రహదారులు - మురుగునీటి పారుదల - నీటి వనరుల పరిస్థితి - తదితరాలపై పరిశీలన చేయనుంది. ఆర్వీ అసోసియేట్స్ ప్రతినిధులు ప్రతి గ్రామంలోనూ వివరాలను సేకరిస్తున్నారు.

రాజధాని గ్రామాల్లోని అంతర్గత రహదారులను కూడా విశాలంగా తీర్చిదిద్దనున్నారు. వీటిని స్థానిక అవసరాలు, రాజధాని స్వరూప స్వభావాలకు అనుగుణంగా మారుస్తారు. పచ్చదనంతోకూడిన డివైడర్లు - సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, ఇరుపక్కలా ఫుట్ పాత్ లు - సైక్లింగ్ ట్రాక్ లు వీటిలోనూ కనువిందు చేయనున్నాయి. డ్రైనేజీ మూతల నుంచి ఇంకుడు గుంతల వరకూ ప్రతి విషయంలోనూ అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు.
Tags:    

Similar News