తమిళనాడు - ఏపీలో కుమారస్వామి తీర్థయాత్రలు

Update: 2018-05-20 08:26 GMT
బీజేపీ నుంచి తమను కాపాడమని ఎన్ని దేవుళ్లను మొక్కుకున్నారో ఏమో కానీ జేడీఎస్ నేత కుమారస్వామి వెంటనే దైవదర్శనాలకు ప్లాన్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం సమయంలో సీట్ల కోసం.. ఆ తరువాత బీజేపీని అధికారం చేపట్టకుండా అడ్డుకోవడం కోసం ఆయన దేవుళ్లకు మొక్కుకున్నారట.
    
కర్ణాటకలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న జేడీఎస్ నేత కుమారస్వామి - ప్రమాణ స్వీకారానికి ముందే పలు దేవాలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య నేతృత్వంలో నియమించిన సమన్వయ కమిటీ సమావేశం కానుండగా, దీనికి కుమారస్వామి హాజరయ్యారు. ఆ తర్వాత తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన హోటల్ కు వెళ్లి, వారితో కాసేపు మాట్లాడనున్న కుమారస్వామి, ఆపై మధ్యాహ్నం నుంచి దైవదర్శనాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది.
    
తన సోదరుడు రేవణ్ణతో కలసి తొలుత తమిళనాడు వెళ్తారని.. అక్కడ శ్రీరంగం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నేరుగా తిరుమలకు కుమారస్వామి వెళతారని జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయన దిల్లీకి కూడా వెళ్లాల్సిఉంది. కాంగ్రెస్ తో ఒప్పందాలు కుదరకపోవడంతో రాష్ట్రస్థాయిలో కాకుండా ఏకంగా దిల్లీలోనే తేల్చుకోవడానికి ఆయన సోనియా, రాహుల్ తో భేటీ కోసం సోమవారం దిల్లీ బయలుదేరుతున్నారు.
Tags:    

Similar News