వైసీపీలోకి కరణం, గొట్టిపాటి?

Update: 2020-03-12 06:00 GMT
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీ కొంపముంచుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాకపోయినా కలిగే నష్టం కంటే ఇంకా ఎక్కువ నష్టపోతోంది ఆ పార్టీ. పార్టీకి అత్యంత విధేయులు... ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి ఫిరాయిస్తుండడంతో చంద్రబాబు వారిని కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరగా.. మరికొందరు చేరడానికి ముహూర్తం నిర్ణయించుకోగా.. ఇప్పుడు మరో ఇద్దరు కీలక ఎమ్మెల్యేలూ అందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజాగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరాం కృష్ణమూర్తి టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన ఆయన వైసీపీలో చేరనున్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో ఆయన ఎక్కడా పాల్గొనలేదు కదా.. కనీసం ఆయన వర్గానికి సంబంధించిన అభ్యర్థులను కూడా నిలపలేదు. దీనికి కారణం వైసీపీలో చేరబోతుండడమే అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీని వీడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిని బలరాం కానీ.. ఆయన వర్గం కానీ ఖండించలేదు.. దాంతో బలరాం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టే అని తెలుస్తోంది.
Read more!

మరోవైపు ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైతం వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇతర పార్టీల నుంచి గెలిచినవాళ్లెవరైనా వైసీపీలో చేరాలనుకుంటే కచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందేనని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా, పలు మార్లు బహిరంగ వేదికలపైనా ఘంటాపథంగా చెప్పారు. ఆ లెక్కల చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా రాజీనామాలు చేసిన తర్వాతే వైసీపీలో చేరాల్సి ఉంటుంది. కానీ అలాంటి అవసరం లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిల మాదిరిగానే రాజీనామా చేయకుండా వైసీపీకి మద్దతిస్తూ ఆ పార్టీ కోసం పనిచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరూ గురువారం మధ్యాహ్నం జగన్‌ను కలుస్తున్నట్లు సమాచారం.




Tags:    

Similar News