వామ్మో ఇంగ్లండ్.. వన్డేల్లో 500 కొట్టేస్తుంది

Update: 2022-06-19 11:10 GMT
ఓ 20 ఏళ్ల కిందట.. వన్డేల్లో 300 కొడితే గొప్ప.. ఓ 10 ఏళ్ల క్రితం 400 కొట్టడం అసాధారణం.. మరిప్పుడు 500 పరుగులు కూడా సాధ్యమయ్యేలా ఉంది. అదికూడా కేవలం ఇంగ్లండ్ అనే జట్టుతోనే అయ్యేలా ఉంది. అంతలా ఉంది మరి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ వీర విహారం. వారి బాదుడు అలాఇలా కాదు.. బంతిని అమాంతం ఎత్తి స్టేడియం అవతల పడేస్తోంది. అందుకే వారు 400 పరుగుల మీటర్ ను ఎప్పుడో దాటేశారు. మొన్నటికి మొన్న 500 మార్క్ కు 2 పరుగుల దగ్గర ఆగిపోయారు.

ఎలాంటి జట్టు ఎలా మారిపోయింది?

క్రికెట్ కే కాదు.. ఇంగ్లండ్ అంటే సంప్రదాయ క్రికెట్ కు పుట్టినిల్లు. వన్డేలైనా, టి20 లైనా వారి ఆట అలానే సాగింది. మిగతా జట్లన్నీ దూసుకుపోతున్నా.. ఇంగ్లండ్ మాత్రం అలానే ఉండిపోయింది. అందుకు నిదర్శనమే 2015 వన్డే ప్రపంచ కప్. గుడ్డిలో మెల్లగా 2010 లో టి20 ప్రపంచ కప్ గెలిచింది కానీ, అదేమంత నిలకడైన ప్రదర్శనగా కాదు. ఇక 2015లో వన్డే ప్రపంచ కప్ లో అయితే ఇంగ్లండ్ ది దారుణ ప్రదర్శన. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ టోర్నీలో కనీసం నాకౌట్ కూ రాలేకపోయింది ఇంగ్లిష్ జట్టు. ఆస్ట్రేలియా చేతిలో 111 పరుగుల తేడాతో ఓటమి, న్యూజిలాండ్ పై 121కే ఆలౌట్, శ్రీలంక చేతిలో 9 వికెట్ల తేడాతో పరాజయం ఇదీ ఆ జట్టు ప్రదర్శన. దీంతో ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.

ఆ దెబ్బతో సమూల మార్పులు

2015 ప్రపంచ కప్ దారుణ ప్రదర్శన దెబ్బతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమూల మార్పులు తెచ్చింది. పాత తరహా ఆటగాళ్లయిన అలిస్టర్ కుక్ వంటి వారిని వన్డేలకు దూరం పెట్టింది. జేసర్ రాయ్, అలెక్స్ హేల్స్, బెయిర్ స్టో, బట్లర్, మోర్గాన్, స్టోక్స్ వంటి దూకుడైన ఆటగాళ్లను ప్రోత్సహించింది. వీరు విధ్వంసకర ఆటగాళ్లు కూడా. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆటతీరే మారిపోయింది. 2018 వచ్చేసరికి ఇంగ్లండ్ వన్డే నంబర్ వన్ అయింది. ఈ క్రమంలో 400 స్కోర్ ను ఉఫ్ మని ఊదిపారేసింది. ఫలితంగా 2019 వన్డే ప్రపంచ కప్ నకు ఫేవరెట్ గా బరిలో
దిగింది. సొంతగడ్డపై జరిగిన ఆ టోర్నీలో ఇంగ్లండ్ అద్భుత ఆటతీరుతో కప్ ను గెల్చుకుంది.

500 సాధ్యమే..

వన్డేల్లో 400 కొట్టడం సాధ్యమైంది. ఇప్పటివరకు 21 సదర్భాల్లో స్కోరు బోర్డు 400 దాటింది. ఇందులో దక్షిణాఫ్రికా 6 సార్లు, టీమిండియా, ఇంగ్లండ్ ఐదుసార్లు ఈ మార్క్ అందుకున్నాయి. గత ఐదేళ్లలో ఇంగ్లండే నాలుగు సార్లు 400 పైగా పరుగులు చేసింది. ఇక శుక్రవారం నాటి నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ ఏకంగా 498 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (93) బంతుల్లో 122, 14 ఫోర్లు, 3 సిక్సులు), తర్వాత వచ్చిన డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125, 9 ఫోర్లు, 3 సిక్సులు), విధ్వంసక వీరులు జాస్ బట్లర్ (70 బంతుల్లో 162, 7 ఫోర్లు, 14 సిక్సులు), లియామ్ లివింగ్ స్టన్ (22 బంతుల్లో 66; 6 ఫోర్లు, 6 సిక్సులు) చెలరేగడంతో ఇంగ్లండ్ ఈ అతి భారీ స్కోరును అందుకుంది. వాస్తవానికి చివరి 3 ఓవర్లలో నెదర్లాండ్స్ బౌలర్లు కాస్త తక్కువ పరుగులిచ్చారు. లేదంటే ఇంగ్లండ్ 500 కొట్టేసేదే.

ఇంకా అవకాశం ఉంది?

ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ తో నెదర్లాండ్స్ మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. వీటిలో ఆదివారం ఒకటి జరగాల్సి ఉంది. పసి కూన అయిన నెదర్లాండ్స్ బౌలింగ్ ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఉతికి ఆరేయడమే కాదు చీరేస్తారనడంలో సందేహం లేదు. దీన్నిబట్టి చూస్తే ముందుగా ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగితే స్కోరు 500 దాటేందుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో?
Tags:    

Similar News