లోకేష్ అభిమాన రాజకీయ నాయకుడు ఆయనే !
వాజపేయి అంటే తనకు ఎంతో ప్రత్యేక అభిమానం అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మహనీయులని లోకేష్ కొనియాడారు.;
నారా లోకేష్ చంద్రబాబు తనయుడు, టీడీపీ ఫ్యూచర్ లీడర్. ఆ పార్టీకి అసలు సిసలైన వారసుడు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఇపుడు అత్యంత కీలక ష్తానంలో ఉన్నారు. ఆయన పార్టీ కోసం ప్రభుత్వం కోసం తన పూర్తి సమయం అయితే కేటాయిస్తున్నారు. అలాంటి లోకేష్ మిత్ర పార్టీలతో కూడా ఎంతో అభిమానంగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచాయి.
వాజ్ పేయ్ అంటే ఇష్టం :
మచిలీపట్నంలో జరిగిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ తన అభిమాన రాజకీయ నాయకుడు ఎవరో చెప్పారు. వాజపేయి అంటే తనకు ఎంతో ప్రత్యేక అభిమానం అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మహనీయులని లోకేష్ కొనియాడారు. దేశంలో అవినీతి మచ్చలేని ఏకైక నేత వాజ్ పేయి అని ఆయన అభివర్ణించారు. భారత దేశంలో భద్రత కోసం అణు పరీక్షలను నిర్వహించి కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ కి వాజ్ పేయి బుద్ధి చెప్పారని లోకేష్ గుర్తు చేశారు. అంతే కాకుండా దేశంలో అనేక రహదారులను నిర్మించి టెలికం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెట్టిన మహనీయులని వాజ్ పేయి గురించి చెబుతూ లోకేష్ కొనియాడారు.
టీడీపీ రధ సారధిగా :
నారా లోకేష్ టీడీపీ రధసారధిగా ఉన్నారు. ఆయన ఎపుడూ తనకు ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ తన తండ్రి చంద్రబాబు అని చెబుతూ వచ్చారు. అది సహజం కూడా. టీడీపీకి ఎన్టీఆర్ చంద్రబాబు చేసిన కృషి అలాంటిది. ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు కూడా టీడీపీని మరింత ముందుకు నడిపించి నాలుగు సార్లు సీఎం అయ్యారు. అలా ఇంట్లో ఇద్దరు దిగ్గజ నాయకులు ఉన్నపుడు లోకేష్ వారి ప్రభావంతోనే రాజకీయంగా ముందుకు అడుగులేశారు. అయితే తన పార్టీ దాటి అభిమాన నాయకుడు ఎవరో ఇప్పటిదాకా లోకేష్ చెప్పలేదు ఇపుడు ఆయన వాజ్ పేయి గురించి చేసిన వ్యాఖ్యలతో ఆయన ఫేవరేట్ పొలిటీషియన్ ఎవరో అందరికీ తెలిసింది. అయితే వాజ్ పేయి ని పొలిటీషియన్ గా పరిధి విధించి చూడవచ్చా అన్నది ఒక చర్చ. ఆయన అన్ని పార్టీలకూ అభిమాన పాత్రుడు. అందరి వాడు, అజాత శతృవు. ఆ విధంగా లోకేష్ కి కూడా ఆయన ఫేవరేట్ లీడర్ అవడంతో ఆశ్చర్యం అయితే లేదని అంటున్నారు.