ఊరిస్తున్న రైల్వే.. వింటుంటేనే ఎంత ఆనందమో..!!

ప్రధాని మోదీ 3.0లో ఏపీకి ప్రాధాన్యం పెరుగుతోందా? అంటే కేంద్ర బడ్జెట్, రైల్వే కేటాయింపులు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.;

Update: 2026-02-03 10:01 GMT

ప్రధాని మోదీ 3.0లో ఏపీకి ప్రాధాన్యం పెరుగుతోందా? అంటే కేంద్ర బడ్జెట్, రైల్వే కేటాయింపులు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2014 నుంచి దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూ లేనట్లు ఈ సారి ఏపీకి అగ్రతాంబూళం ఇస్తోన్నట్లు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే ప్రాజెక్టులను ఉదహరిస్తున్నారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.10,134 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న బుల్లెట్ రైళ్లు ఏపీ మీదుగా దూసుకుపోనున్నాయి. ఇవి ఏపీ అభివృద్ధికి గేమ్ ఛేంజర్ అవ్వనున్నాయని విశ్లేషిస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వణీ వైష్ణవ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏపీని దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధానమైన మెట్రో నగరాలతో అనుసంధానించేలా కేంద్రం బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లతోపాటు అమరావతి-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదనలను కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోందని చెబుతున్నారు. దీంతో దక్షిణాన మూడు ప్రధాన నగరాలతో ఏపీ రాజధాని అమరావతికి కనెక్టవిటీ పెరుగుతుందని అంటున్నారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ లో రాజధాని అమరావతిని చేర్చారు. దీనివల్ల హైదరాబాద్ కు కేవలం గంటలోనే చేరుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు.

హైస్పీడ్ కారిడార్ల వల్ల హైదరాబాద్-చెన్నై-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోనుంది. ఈ రెండు హైస్పీడ్ కారిడార్లు రాష్ట్రం మీదుగా వెళుతుండటం వల్ల ఏపీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 7 హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వీటి నిర్మాణం పూర్తయితే గంటకు 350 కి.మీ. స్పీడుతో బుల్లెట్ రైళ్లు దూసుకుపోనున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ మోడల్ లో వీటిని నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రజాజీవనీనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

మరోవైపు బడ్జెట్ లో ఏపీకి అనేక రైల్ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. ఇందులో ప్రధానమైనది విశాఖ రైల్వే జోన్. ఇప్పటికే మంజూరైన రైల్వే జోన్ భవన నిర్మాణాలను వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రి అశ్వణీ వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. అదేవిధంగా చెన్నై-కోల్ కత్తా రైల్వే లైన్ ను మూడు, నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఈ లైన్ ఏపీలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఉంది. దీంతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం దక్కుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 73 అమృత్ స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సూళ్లూరుపేట, రాయనపాడు, కాకినాడ టౌన్, మంగళగిరి, తుని స్టేషన్ల నిర్మాణం పూర్తయింది.

Tags:    

Similar News