సుప్రీం సీజేఐ రావద్దు.. నల్సార్ విద్యార్థుల సంచలన లేఖ!
తాము న్యాయవిద్యార్థులమని, మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టాలు అందుకోబోతున్న తుది సంవత్సరం విద్యార్థులమని వారు గుర్తుచేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ను నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆహ్వానించవద్దు అంటూ న్యాయవిద్య అభ్యసిస్తున్న 450 మంది విద్యార్థులు రాసిన లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానం అధిపతి వైఖరిని ప్రశ్నిస్తూ విద్యార్థులు ఆ లేఖలో సంధించిన ప్రశ్నలు హాట్ టాపిక్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రఖ్యాత నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోని అత్యంత న్యాయ ప్రమాణాలు పాటించే విశ్వవిద్యాలయంగా నల్సార్ కి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆ వర్సిటీలో చదువుకున్న 450 మంది విద్యార్థులు సుప్రీం సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించే విషయమే ముందుగానే అభ్యంతరం వ్యక్తం చేయడం పెను సంచలనంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఎప్పుడు నిర్వహించేది ఇప్పటివరకు ఖరారు కాలేదని చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించాలనే విషయాన్ని వర్సిటీ అధికారులు నిర్ణయించలేదు. అయినప్పటికీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌కు లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్య అతిథి ఎంపిక ప్రక్రియ ఇంకా చర్చల దశలోనే ఉందనే విషయం తమకు తెలుసు అంటూనే, సీజేఐ వద్దంటూ విద్యార్థులు లేఖ రాయడంపై న్యాయవాద వర్గాలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నాయి.
తాము న్యాయవిద్యార్థులమని, మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టాలు అందుకోబోతున్న తుది సంవత్సరం విద్యార్థులమని వారు గుర్తుచేశారు. రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం, ప్రజా సమస్యల పట్ల బాధ్యత, వివేకంతో స్పందించడం వంటివే వర్సిటీ తమకు నేర్పిన ప్రాథమిక విలువలు అని తెలిపారు. యూనివర్సిటీ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆ విలువలు ప్రతిబింబించాలని అభిప్రాయపడ్డారు.
పౌరుల నిరసన హక్కులను, పోలీసుల క్రూరత్వంపై వస్తున్న తీవ్ర ఆరోపణలను తేలికగా తీసిపారేసేలా వ్యవహరించారనే అభిప్రాయాలు ఉన్న వ్యక్తి చేతుల మీదుగా తమ డిగ్రీలను స్వీకరించడం.. నల్సార్‌లో తాము అభ్యసించిన విలువలకు, నైతికతకు విరుద్ధంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని వర్సిటీ యంత్రాంగం తీవ్రంగా పరిగణించి స్నాతకోత్సవ ముఖ్య అతిథి ఎంపికపై పునఃపరిశీలన చేయాలని అభ్యర్థించారు.
మరోవైపు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్' (టిస్) 86వ స్నాతకోత్సవం వాయిదా పడటం కూడా ప్రస్తుతం విద్యావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 2న జరగాల్సిన ఆ కార్యక్రమాన్ని 'అనుకోని పరిస్థితుల' కారణంగా వాయిదా వేస్తున్నట్లు టిస్ యాజమాన్యం చివరి నిమిషంలో ప్రకటించినప్పటికీ, అందుకు సంబంధించిన అసలు కారణాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.