బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా ?
ఆరు నూరు అయినా ఈసారి తెలంగాణా రాష్ట్రంలో కమలం జెండా పాతాల్సిందే అని బీజేపీ పెద్దలు గట్టిగానే నిర్ణయించుకున్నారు.
కేంద్ర మంత్రిగా ప్రస్తుతం ఉన్న బండి సంజయ్ కి తెలంగాణా బీజేపీ పగ్గాలు దక్కే అవకాశాలు దండీగా కనిపిస్తున్నాయి. ఆయనకు అటు ఆర్ఎస్ఎస్ అలాగే కేంద్ర పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా నూరు శాతం మార్కులు సాధించిన ట్రాక్ రికార్డు కూడా కళ్ల ముందు ఉంది. ఆయన హయాంలో బీజేపీ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించింది. అంతే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే దాదాపుగా యాభై దాకా కార్పోరేటర్లను గెలుచుకుంది. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న నాడు పార్టీని పరుగులు పెట్టించారు. ఢీ అంటే ఢీ అనేలా కేసీఆర్ ప్రభుత్వం మీద దూకుడు చేసేవారు. అయితే సరిగ్గా 2023 ఎన్నికల ముందు ఆయన్ని తప్పించేశారు. దాంతో బీజేపీలో జోష్ పోయింది అన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి.
అనుకూల వాతావరణంగానే :
ఇక బీజేపీకి చెందిన పెద్దలు కొందరు తెలంగాణాలో తిష్ట వేసి గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను అధ్యయనం చేశారు అని అంటున్నారు. అంతే కాదు పార్టీకి అంతా అనుకూల వాతావరణం ఉందని నిర్ధారించారు. అయితే దానిని సొమ్ము చేసుకునే విధంగా పార్టీయే లేదని తేల్చారు. బీజేపీ నాయకుల మధ్య విభేదాలు వర్గ పోరు కారణం అని కూడా తమ నివేదికలలో పేర్కొన్నారు. దాంతో పార్టీ పెద్దలు అంతా కలసి నాయకుల మధ్య సఖ్యత పెరిగేలా చూస్తున్నారు. అందులో భాగమే ఈటెల రాజేందర్ అలాగే బండి సంజయ్ చేతులు కలపడం అని చెబుతున్నారు. అలాగే మరింత మంది నాయకుల మధ్య కూడా ఐక్యతను సాధించారు అని అంటున్నారు.
ఈసారి కొట్టాల్సిందే :
ఆరు నూరు అయినా ఈసారి తెలంగాణా రాష్ట్రంలో కమలం జెండా పాతాల్సిందే అని బీజేపీ పెద్దలు గట్టిగానే నిర్ణయించుకున్నారు. దాంతోనే పార్టీ ప్రక్షాళన మొదలెట్టారు. బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నియమితులు అయిన నితిన్ నబీన్ అయితే ఫుల్ ఫోకస్ తెలంగాణా మీద పెట్టారు. ఆయన ఇప్పటికే రెండు మూడు సార్లు పర్యటించి వెళ్ళారు. ఇక మీదట ప్రతీ రెండు నెలలకు ఒకసారి తప్పకుండా తెలంగాణాలోకే వచ్చి మొత్తం పార్టీ పరిస్థితులు సమీక్ష చేస్తాను అని జాతీయ నాయకత్వమే సూచించడంతో నేతలు అంతా అలెర్ట్ గా ఉంటున్నారని తెలుస్తోంది.
సమర్ధులకు పెద్ద పీట :
పార్టీలో అందరికీ న్యాయం చేస్తామని అధినాయకత్వం చెబుతోంది. ఎవరూ నిరాశ చెందాల్సింది లేదని అంటోంది. ఈ విధంగా ఈటెలకు కూడా రానున్న రోజులలో మంచి అవకాశాలు ఉంటాయని అంటోంది. బండి సంజయ్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఈటెలకు కేంద్ర మంత్రిగా చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే మహిళా కోటాలో డీకే అరుణకు కూడా కేంద్ర మంత్రిగా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరో వైపు చూస్తే పార్టీ నుంచి వీడిపోయిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లాంటి ఫైర్ బ్రాండ్లను తిరిగి పార్టీలోకి తీసుకుంటారు అని కూడా అంటున్నారు. మొత్తానికి రానున్న రోజులలో పార్టీకి రిపేర్లు మొత్తం చేసి దసరా నాటికి తెలంగాణా బీజేపీ బండిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. అదే జరిగితే బీజేపీ దూకుడు కూడా వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.