టార్గెట్ లోకేష్...ఎందుకంటే ?

వైసీపీ తన వ్యూహం మార్చింది. ఇంతకాలం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునే ఎక్కువగా విమర్శిస్తూ వచ్చిన వైసీపీ ఇపుడు మంత్రి నారా లోకేష్ ని గట్టిగా టార్గెట్ చేసింది.

Update: 2026-08-10 06:16 GMT

వైసీపీ తన వ్యూహం మార్చింది. ఇంతకాలం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునే ఎక్కువగా విమర్శిస్తూ వచ్చిన వైసీపీ ఇపుడు మంత్రి నారా లోకేష్ ని గట్టిగా టార్గెట్ చేసింది. నిజానికి లోకేష్ ని వైసీపీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కారు, విధానపరమైన నిర్ణయాలలో ఆయన భాగంగా బయటకు కనిపించేది లేదు, మరి ఎందుకు వైసీపీ లోకేష్ ని ఫోకస్ చేసింది అంటే అక్కడే అసలైన రాజకీయం ఉందని అంటున్నారు. లోకేష్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా నిజానికి ఆయన ప్రాధాన్యత అంతకు మించి అని అంటున్నారు. ఆయన పార్టీలో ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్నారు అన్నది ప్రచారంలో ఉన్న మాట. టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి ఈ విషయాలు తెలియవని ఎవరూ అనుకోరు. అందుకే వైసీపీ తన స్ట్రాటజీ మార్చి లోకేష్ ని అందులో ఫిక్స్ చేసింది అని అంటున్నారు.

ఆయనతోనే అంతా :

లోకేష్ తోనే టీడీపీ ఫ్యూచర్ కానీ భవిష్యత్తు రాజకీయం కానీ సాగనుంది అన్నది పార్టీ జనాలకే కాదు, బయట జనాలకు కూడా అర్ధం అయిన విషయం. అందుకే వైసీపీ కూడా ముందు జాగ్రత్తగా అన్నట్లు ముందర కాళ్ళకు బంధం వేస్తోంది అని అంటున్నారు. లోకేష్ ని వైసీపీ అనుకూల మీడియా కానీ సోషల్ మీడియా కానీ ముఖ్యమైన మంత్రిగా సంభోదిస్తూంటారు. అంటే ఆయన కీలకం అని చెప్పడమే అంటున్నారు. పార్టీలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో ఉన్నారు. అలా నిర్ణయాలలో ఆయన పాత్ర ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వంలో కూడా లోకేష్ పాత్ర ఎక్కువగానే ఉందని భావిస్తూ లోకేష్ ని వైసీపీ ఇపుడు బాగానే టార్గెట్ చేస్తోంది.

డీఎస్సీ వివాదం వెనక :

మెగా డీఎస్సీ అక్రమాలు ఇవన్నీ వైసీపీ ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా చేయాల్సిన రాజకీయమే కావచ్చు. అయితే దానిని దీర్ఘ కాల నిరసనలు గా మార్చడం లోకేష్ ని ఏకంగా రాజీనామా చేయమనడం ద్వారా కార్నర్ చేయాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది. ఆయన తన మంత్రిత్వ శాఖలో ఫెయిల్ అయ్యారని జనాలకు చెప్పడం ముఖ్యంగా నిరుద్యోగ యువతలో ఈ యువ మంత్రి మీద ఉన్న ఆశలు కానీ పెట్టుకున్న ఆకాంక్షలు కానీ దెబ్బ తీయాలన్న ఉద్దేశ్యం కూడా కనిపిస్తోంది అంటున్నారు. లోకేష్ ని ఇప్పటి నుంచే అంటే మంత్రిగా ఉన్నప్పుడే గట్టిగా ఫిక్స్ చేస్తే రేపటి రోజున ఈ వివాదాలు అన్నీ మరకలు మచ్చలుగా మార్చవచ్చు అన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు.

ప్రత్యర్ధి ఆయనేనా :

ఇక వైసీపీకి మరో క్లారిటీ కూడా ఉంది. 2029 ముందో తరువాతనో టీడీపీ నుంచి అసలైన ప్రత్యర్ధిగా నారా లోకేష్ ఉంటారని పూర్తిగా అర్ధం అయింది అని అంటున్నారు. చంద్రబాబుని ఇంతకాలం విమర్శిస్తూ వచ్చిన వైసీపీ అందుకే సడెన్ గా రూట్ మార్చి లోకేష్ వైపు తిరిగింది అని అంటున్నారు. లోకేష్ మంత్రిగా తన సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు అన్నది జనాలకు తెలియచెప్పడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి మెటీరియల్ గా ఎలా సూట్ అవుతారు అన్న ధర్మ సందేహాలను కూడా పంపించడమే పరమార్ధం అని అంటున్నారు.

డిఫెన్స్ లో పెట్టాలని :

వైసీపీ అధినాయకత్వం నోట ఎపుడూ వచ్చే పేరు ఒక్కటే ఉంటుంది. అది చంద్రబాబు మాత్రమే. మిగిలిన వారిని ఎవరున్నా అసలు పట్టించుకోరు. కానీ కోరి మరీ లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు అంటేనే మ్యాటర్ వెనక వ్యూహం ఉందని అంటున్నారు. మరి వైసీపీ తన ప్రత్యర్ధిగా లోకేష్ ని గుర్తించి ఆయనను డిఫెన్స్ లో పెట్టాలని చూస్తోంది. ఈ ఎత్తుకు పై ఎత్తు టీడీపీ ఏ విధంగా వేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో అయితే ఒక క్లారిటీ వచ్చింది. రానున్న కాలంలో జగన్ వర్సెస్ లోకేష్ అన్నది ఇంతకు ఇంత గట్టిగానే పొలిటికల్ వార్ గా మారుతుందని అంటున్నారు. దానికి ప్రీ రిహార్సల్స్ గానే వీటిని చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News