మేయర్ సీటా...మజాకానా ?
ఇక వీటితో పాటుగా తిరుపతి రాజమండ్రి కాకినాడ ఇలా అనేకం ఉన్నాయి. ఎక్కడ అయినా సరే మేయర్ సీటుకు పోటీ పడటం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.
మేయర్ ఎన్నికలకు ప్రత్యధ విధానంలో జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా మంది ద్వితీయ శ్రేణి నేతల ఆశలను తగ్గించింది అని అంటున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం అంటే సొంతంగా ప్రజల మన్ననలు పొందాలి. అంతే కాదు అన్ని వార్డుల కార్పోరేటర్లను కలుపుకుని పోవాలి. వారికి ఆర్థికంగా సైతం అండగా నిలవాలి. ఒక విధంగా ఇది మహా యజ్ఞంగా ఉంటుంది. బిగ్ షాట్స్ కి తప్ప మిగిలిన వారికి ఈ విధంగా డైరెక్ట్ ఎన్నికలను ఫేస్ చేయడం అంటే కష్టమే అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఏపీలో పెద్ద కార్పోరేషన్లుగా విశాఖ విజయవాడ ఉన్నాయి. వీటి కోసమే కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక వీటితో పాటుగా తిరుపతి రాజమండ్రి కాకినాడ ఇలా అనేకం ఉన్నాయి. ఎక్కడ అయినా సరే మేయర్ సీటుకు పోటీ పడటం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.
భారీ బడ్జెట్ తోనే :
విశాఖ మేయర్ సీటునే తీసుకుంటే ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అవుతుందని లెక్క వేస్తున్నారు. కనీసంగా నలభై నుంచి యాభై కోట్ల దాకా ఖర్చు అవుతుందని కూడా చెబుతున్నారు. దాంతోనే చాలా మంది మేయర్ గా కుర్చీ ఎక్కాలని ఆశ ఉన్నా వెనక్కి తగ్గుతున్నారు. మరి కొంత మంది అయితే కూటమికి ఎదురు లేదు కదా టికెట్ తెచ్చుకుంటే చాలు అని చూస్తున్నా కూడా సొంత కార్పోరేటర్లకు ఆర్ధికంగా ఇవ్వాల్సింది ఇచ్చి సహకరించకపోతే వర్కౌట్ కాదని అంటున్నారు. అంటే ఏకపక్షంగా ఎన్నికలు జరిగినా కూడా పెట్టాల్సిన ఖర్చు పెట్టక తప్పదనే అంటున్నారు. దీంతోనే ఈ ఖర్చుని చూసి జడిసి వెనక్కి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. దీని కంటే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడమే బెటర్ అని భావిస్తున్న వారూ ఉన్నారు.
అడిగినా సరే :
ఇక మిత్ర పక్షాలుగా జనసేన బీజేపీ మేయర్ సీటు కోసం అడుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సీటు తెచ్చుకోవడం ముఖ్యం కాదని ఎన్నికలను నిర్వహించడం ముఖ్యమని అంటున్నారు. ఆర్ధికంగా అన్నీ తట్టుకుని నిలబడే నేతలు కూడా కావాలని అంటున్నారు. ఇక సొంత పార్టీ వారిని కష్టించి పనిచేసే నేతలను వదిలేసి బడా వ్యక్తులను తెచ్చి మేయర్ పీఠం కోసం పోటీ చేయించా ఉపయోగం లేదని అంటున్నారు. ఎందుకంటే వారి కోసం పనిచేయాల్సింది కార్యకర్తలు అని గుర్తు చేస్తున్నారు. అంటే పార్టీ నేతలుగా ఉండాలి, వారితో మమేకం అవుతూనే అన్ని విధాలుగా సమర్ధులుగా ఉన్న వారే మేయర్ సీటు కోసం పోటీ పడితే అర్ధం వుంటుందని అంటున్నారు.
సహకారం కూడా :
ఇక స్థానిక సంస్థల ఎన్నికల తీరు వేరుగా ఉంటుందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీనే చూస్తారు, స్థానిక ఎన్నికల్లో వ్యక్తులను కూడా చూస్తారు, అందువల్ల చిక్కులు వస్తాయని చెబుతున్నారు. తమతో అంతగా కలవని వారిని తెచ్చి పెట్టి పోటీ చేయిస్తే క్యాడర్ సహకరించే పరిస్థితి ఉండదని అంటున్నారు. అంతే కాకుండా క్రాస్ చేసే చాన్సెస్ కూడా ఉన్నాయని కలవరపడుతున్నారు. ఇక కూటమిలో చూస్తే ఒక్క పార్టీ కాదు మూడు ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య కో ఆర్డినేషన్ కూడా మరో ప్రధాన సమస్యగా ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ చూసుకున్నపుడు మేయర్ అభ్యర్థి ఎంపిక అన్నది కూటమికి బిగ్ చాలెంజ్ గానే మారబోతోంది అని అంటున్నారు. వైసీపీ కూడా మేయర్ సీటుని ఒక సవాల్ గా తీసుకున్న నేపధ్యంలో పోటీ గట్టిగా జరిగితే మాత్రం బలమైన అభ్యర్ధులే అన్ని విధాలుగా తట్టుకునే పరిస్థితి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.