మచిలీపట్నం మండలాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ!
మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో కూటమి ఆధిక్యం - అభివృద్ధి పనులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర మౌలిక సదుపాయాలు, రోడ్లు, పోర్టు అనుబంధ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
మచిలీపట్నం (బందరు) మండలాల పరిధిలో ప్రస్తుత రాజకీయాలు కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నాయకుడు అయితే.. ఎంపీ జనసేన నాయకుడు కావడం గమనార్హం. దీంతో ఇద్దరూ సమన్వయంతోనే ముందుకు సాగుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీ కార్యకర్తల సమన్వయం మాత్రం కొంత ప్రశ్నార్థకంగా ఉంది. దీంతో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానిక రాజకీయం ఆసక్తిగా మారుతోంది.
మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో కూటమి ఆధిక్యం - అభివృద్ధి పనులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర మౌలిక సదుపాయాలు, రోడ్లు, పోర్టు అనుబంధ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కూటమి క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎంపీ వల్లభనేని బాలశౌరి నియోజకవర్గ కేంద్రంగా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు - జనసేనలో అంతర్గత సమీకరణాల వంటివి మాత్రం ఇరు వర్గాల మధ్య కొంత దూరం పెంచుతున్నాయి.
ఇటీవల కాలంలో మచిలీపట్నంలో స్థానిక మున్సిపల్/మేయర్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి జనసేన పార్టీలో అంతర్గత చర్చలు, కొన్ని విభేదాలు బయటకు వచ్చాయి. మేయర్ అభ్యర్థిత్వం కోసం బండి రామకృష్ణ, కొట్టే వెంకట్రావు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. ఎంపీ బాలశౌరి సమక్షంలోనే ఇరువురు వాగ్వాదానికి దిగారు. దీంతో అధిష్టానం జోక్యం చేసుకుని చక్కదిద్దింది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీ, రూరల్ మండలాల్లో క్లీన్ స్వీప్ చేయాలని జనసేన-టీడీపీ కూటమి వ్యూహాలు రచిస్తోంది.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. గతంలో ఇక్కడ బలంగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు స్థానిక సమస్యలపై పోరాడుతున్నారు. అధికార పార్టీల వైఫల్యాలను, మున్సిపల్ అధికారుల తీరును ఎండగడుతున్నారు. తద్వారా క్యాడర్‌లో జోష్ నింపేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సామాజిక సమీకరణాల విషయానికి వస్తే.. మచిలీపట్నం రూరల్, అర్బన్ ప్రాంతాలలో కాపు, గౌడ, మత్స్యకార సామాజిక వర్గాల ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు.
ప్రస్తుతం కూటమికి ఈ వర్గాల నుంచి బలమైన మద్దతు లభిస్తుండగా, వైఎస్సార్సీపీ తన పాత ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తోంది.మొత్తంగా చూస్తే, ప్రస్తుతం మచిలీపట్నం రాజకీయాలు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరిల నేతృత్వంలో అధికార కూటమి హవా నడుస్తుండగా, ప్రతిపక్ష వైసీపీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదేసమయంలో పేర్ని తన హవాను నిలబెట్టుకునేందుకు.. ముఖ్యంగా వారసుడి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.