ఉప ఎన్నిక : మరో దారి లేని ‘దానం’ !
తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటును తప్పించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటును తప్పించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు వేసిన అనర్హత వేటును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, అనర్హత వేటు నేపథ్యంలో ఉప ఎన్నికలకు వెళ్లాలని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్పి, జస్టిస్ మోహన బెంచ్ ‘హైకోర్టు తీర్పు లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని’ తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా దానం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.
2023 శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్ 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ వద్ద అనర్హత పిటీషన్లు దాఖలు చేశారు.
అయితే అనర్హత పిటీషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేయడంతో బీఆర్ఎస్ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో 2025 జూలై 31న సుప్రీంకోర్టు మూడు నెలల్లో అనర్హత అంశాన్ని తేల్చాలని స్పీకర్ ను ఆదేశించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఏడాది మార్చి 11న ఫిరాయింపులకు తగిన ఆధారాలు లేవంటూ అనర్హత పిటీషన్లను కొట్టేశారు.
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సెప్టెంబర్ 18న విచారించిన హైకోర్టు దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయిందని ఆర్డర్ ను స్పీకర్, శాసనసభ కార్యదర్శి, ఎన్నికల కమిషన్ కు పంపాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించిన దానం నాగేందర్ ‘తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టుకు వెళ్లనని, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని’ ప్రకటించారు. కానీ 24 గంటల్లోనే యూ టర్న్ తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ ఊరట లభించక పోవడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం అని తేలిపోయింది.