డాలర్ల ఎర.. హన్ మాన్ విగ్రహా వివాదం.. అమెరికా ఎన్నికల్లో దేశీ మార్క్ పొలిటికల్ డ్రామా

ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు.. అమెరికా నేతల మైండ్ సెట్ కూడా మన దేశీ పొలిటీషియన్ల రూట్‌లోకి వచ్చేస్తోంది.

Update: 2026-09-24 09:50 GMT

ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు.. అమెరికా నేతల మైండ్ సెట్ కూడా మన దేశీ పొలిటీషియన్ల రూట్‌లోకి వచ్చేస్తోంది. ఇప్పటివరకు పన్నులు, ఉద్యోగాలు, వలసలంటూ బోరింగ్ లెక్కలు చెప్పిన నాయకులు.. ఇప్పుడు గేర్ మార్చారు. “మాకు ఓటేస్తే మీ జేబులు నింపుతాం.. లేదంటే సాంస్కృతిక యుద్ధమే” అంటూ ఓటర్లను కట్టిపడేసేందుకు సరికొత్త నాటకానికి తెరతీశారు. 2026 మధ్యంతర ఎన్నికల వేళ అమెరికా రాజకీయం లంచాలు, లొల్లీల మధ్య రసవత్తరంగా మారింది.

‘ట్రంప్ డివిడెండ్’.. జేబులో పడేది ఐదు వేలేనా?

అటు చూస్తే డొనాల్డ్ ట్రంప్ మావ సరికొత్త బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. రిపబ్లికన్లు అధికారంలోకి వస్తే ప్రతి అమెరికన్ వయోజనుడికి ఏకంగా $5,000 ‘ట్రంప్ డివిడెండ్’ ఇస్తారట.. ప్రతిపాదన వినడానికి భలే ఉంది కానీ దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి..? చట్టాలు ఒప్పుకుంటాయా అని అడిగితే మాత్రం కాస్త కలవరపడే సమాధానమే వస్తుంది. ఈ ఉచితాల లెక్క దాదాపు 1.35 ట్రిలియన్ డాలర్లు అవుతుందని రాయిటర్స్ అంటోంది. అంటే మన భాషలో చెప్పాలంటే.. ఇచ్చేది రూపాయి.. కొట్టేది కొబ్బరికాయ టైప్ అన్నమాట..

హనుమంతుడి విగ్రహంపై గద్దల కన్ను

ఇదిలా ఉంటే టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో 90 అడుగుల ఎత్తున రాజసంగా నిలబడిన ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’’ హనుమాన్ విగ్రహంపై కొంతమంది కన్జర్వేటివ్‌లకు అకస్మాత్తుగా కడుపులో మంట మొదలైంది. ఒక మాగా యూట్యూబర్ జెస్సీ హ్యూజెస్ ఆ విగ్రహం ఫొటో పెట్టి.. “మేము గెలవగానే దీన్ని కూల్చేస్తాం” అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. అసలు ఆయన ఏ గెలుపు గురించి మాట్లాడారో సొంత స్థలంలో ఆలయం కట్టుకున్న హిందూ-అమెరికన్లను బెదిరించి సాధించేదేమిటో ఆ దేవుడికే తెలియాలి..

ప్రభుత్వ స్థలంలో ఉంటే ఏమైనా అనొచ్చు అనుకోవడానికి అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. శ్రీ అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణం. కానీ అమెరికాలో మత స్వేచ్ఛ గురించి లెక్చర్లు ఇచ్చే నేతలకు ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లేదా అని స్థానిక భారతీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్మీలో పనిచేసిన రుచిర్ బక్షీ లాంటి వాళ్ళు గట్టిగానే ఎదురుదాడి చేయడంతో ఈ డ్రామా కాస్త గ్లోబల్ లెవెల్‌కి చేరింది.

ఓట్ల కోసం ‘ఫ్రీబిస్’.. సీట్ల కోసం ‘విద్వేషం’

మొత్తానికి అమెరికా ఎన్నికలు ఇప్పుడు రెండు భిన్న ధోరణుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు జేబులు నింపే ఉచిత హామీలు, మరోవైపు మైనారిటీల గుర్తింపును ప్రశ్నించే చౌకబారు కామెంట్లు.. ఒక విగ్రహాన్ని తొలగించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా.. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం.. ఓట్ల రీ-పోలరైజేషన్ కోసం రాజకీయ క్రీడ నడుస్తోంది. మరి ఈ "ఫ్రీ డివిడెండ్ల" కలరింగ్, "హనుమాన్ గుడి" పంచాయితీలు ఓటర్ల మైండ్ మార్చుతాయో లేదో ఎన్నికల రిజల్ట్స్ వచ్చాకే చూడాలి.

Tags:    

Similar News