బొత్స కంటే చిన్న శ్రీను బలవంతుడా ?
బొత్సకు నీడలా ఉంటూ జిల్లాపైన చిన్న శ్రీను ఆధిపత్యం చాటుకున్నారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ జిల్లాను చిన్న శ్రీనుకు అప్పగించారు.
విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ సీనియార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొత్సది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. అయితే అందులో సగం పైగా జీవితం చిన్న శ్రీనుది. ఈ ఇద్దరూ కలిసి రెండు దశాబ్దాలకు పైగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. బొత్సకు నీడలా ఉంటూ జిల్లాపైన చిన్న శ్రీను ఆధిపత్యం చాటుకున్నారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ జిల్లాను చిన్న శ్రీనుకు అప్పగించారు. ఆ విధంగా చిన్న శ్రీను పాతుకుని పోయారు అని చెప్పాలి. ఈ రోజున జిల్లాలో వైసీపీలో అనేక పదవులు అనుభవిస్తున్న వారందరికీ నేరుగా చిన్న శ్రీనుతోనే పరిచయాలు సాన్నిహిత్యం ఉంది. అందుకే అయిదుగురు జెడ్పీటీసీలు రాజీనామా చేసి చిన్న శ్రీను వెంట నడిచారు అని చెబుతున్నారు.
వ్యూహాలతోనే అంతా :
చిన్న శ్రీను పేరులో చిన్న ఉండొచ్చు కానీ ఆయన వ్యూహాలలో పెద్ద అని అంటున్నారు. ఆయన రాజకీయ బలం ఏంటో త్వరలోనే చూపిస్తారు అని అంటున్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ మొత్తంగా ఆయనకు పట్టు ఉందని అంటున్నారు. చిన్న శ్రీను ఇపుడు టీడీపీలో చేరడంతో సహజంగానే ఆయన వర్గం కూడా ఆ వైపే ఉంటుందని అంటున్నారు. చిన్న శ్రీను వెంట తాము పాతికేళ్ళుగా నడిచామని అందుక ఆయన తోనే తాము అంటూ వైసీపీకి రాజీనామా చేసిన జెడ్పీటీసీలు చెప్పడాన్ని బట్టి చూస్తే ఇక్కడ పార్టీ కంటే చిన్న శ్రీనుకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎవరు పోయినా పార్టీ శాశ్వతం అన్న బొత్స మాటలకు భిన్నంగా తమకు చిన్న శ్రీనుయే ముఖ్యమని పలువురు నేతలు చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.
చిన్న శ్రీను ప్రభావం :
ఇదిలా ఉంటే జిల్లా రాజకీయాల్లో చిన్న శ్రీను ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఆయనకు ఉన్న అనుచర గణంతో పాటు వ్యూహాలు సామాజిక బలం రాజకీయ చతురత ఇవన్నీ కలస్తే ఆయన జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు. జిల్లాలో అణువణువూ తెలిసిన నేతగా ఆయన ఉన్నారు. టీడీపీలో కూడా ఆయన ధీటుగానే రాణించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. అక్కడ నియోజకవర్గం నాయకులే అధికంగా ఉన్నారు. అలాంటి చోట జిల్లా మొత్తం తెలిసిన నేతగా చిన్న శ్రీను హవా ఉంటుందని చెబుతున్నారు. మరో వైపు చూస్తే చిన్న శ్రీను వైసీపీని వీడడం వల్ల ఆ పార్టీకి తీరని నష్టం అని అంటున్నారు.
బొత్సకు ఇబ్బందులేంటి :
ఇక బొత్స విషయం చూస్తే చిన్న శ్రీను మాదిరిగా కుడిభుజం లాంటి నాయకుడు వెంట లేకపోవడం మైనస్ గా మారుతోంది అని అంటున్నారు. బొత్స రాష్ట్ర స్థాయి నేత. ఆయన జిల్లాలో ప్రతీ చోటా తిరిగి అంతటా తానుగా కనిపించలేరు. మరో వైపు చూతే క్యాడర్ కి ఆయనకు మధ్య ఇపుడు గ్యాప్ ని పూరించే నాయకత్వం కావాలి. ఆయన రాజకీయ వారసులుగా సొంత బిడ్డలు ఉన్నా వారు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నారు. ఈ నేపధ్యంలో చిన్న శ్రీనుని టీడీపీని ఏకకాలంలో ఢీ కొట్టడం అంటే వైసీపీకి బొత్స కి కష్ట సాధ్యమే అవుతుంది అని అంటున్నారు. బొత్స సైతం పదునైన రాజకీయ వ్యూహాలు రచించగలరు, కానీ ఆయనకు వయోభారం కూడా ఒక సమస్యగా మారుతుందని అంటున్నారు. ఏది ఏమైనా బొత్స వర్సెస్ చిన్న శ్రీను అంటే చిన్న శ్రీను వైపే నేతలు మళ్ళడాన్ని చూసినపుడు చిన్న శ్రీను బలవంతుడుగా వారికి కనిపిస్తున్నారా అంటే ఇప్పటికి ఇదే కరెక్ట్ అని అంటున్నారు.