దక్షిణాదిలో పవర్ ఎమర్జెన్సీ.. జీరో స్థాయికి హైడల్ విద్యుత్ ఉత్పత్తి.. థర్మల్ పవర్ ఒక్కటే దిక్కు

వచ్చే ఆరు నెలల్లో ఎల్ నినో మరింత తీవ్ర రూపం దాల్చనుందని, దీంతో వచ్చేఏడాది మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Update: 2026-09-24 08:39 GMT

వాతావరణ మార్పుల ప్రభావంతో దేశంలోని విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి దక్షిణ భారత్ లో విద్యుత్ వినియోగం ఊహించని రీతిలో పెరిగిపోవడంతో పవర్ సెక్టార్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఎల్ నినో ప్రభావంతో వానలు కరవై, ఎండల తీవ్రత పెరగడంతో పాటు విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు నెలకున్నాయని అంటున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎల్ నినో మరింత తీవ్ర రూపం దాల్చనుందని, దీంతో వచ్చేఏడాది మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా వేసవిలో ఎండల తీవ్రత వల్ల కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి నుంచి మే వరకు గృహ విద్యుత్ వినియోగం కూడా గరిష్టంగా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు వర్షాభావం కారణంగా ఎండలు వేసవిని తలపిస్తుండటంతో గృహ వినియోగం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో నదులలో నీటి ప్రవాహం లేకపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. దీంతో థర్మల్, సోలార్ పవర్ పై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకున్నాయని అంటున్నారు. ఇక వర్షాలు లేకపోవడం వల్ల పంటలకు నీరు పెట్టేందుకు కూడా రైతులు ఎక్కువగా విద్యుత్ ను వాడుతున్నారు. ఒకవైపు హైడల్ విద్యుత్ ఉత్పత్తి జీరో స్థాయికి పడిపోగా, విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా ఎగబాకిందని చెబుతున్నారు.

రికార్డు స్థాయికి డిమాండ్

గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం ఏకంగా 20 శాతం మేర అధికంగా ఉందని చెబుతున్నారు. గతంలో రోజువారీ డిమాండ్ సగటున 240 మిలియన్ యూనిట్ల మేర ఉండగా, ప్రస్తుత పరిస్థితిలో అది ఏకంగా 290 మిలియన్ యూనిట్లకు పైగా చేరింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇదే రకమైన ఆల్‌టైమ్ గరిష్ఠ డిమాండ్ నమోదవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఇదే రకమైన పవర్ స్కార్సిటీ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

నిరంతర సరఫరాకు కసరత్తు

పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు విద్యుత్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత రాకుండా ముందస్తుగా నిల్వలను సమకూర్చుకోవడం, విద్యుత్ అంతరాయాలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బయటి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం వంటి చర్యలు చేపట్టారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా నిరంతరం సరఫరాను అందించేందుకు అధికార యంత్రాంగం రౌండ్-ది-క్లాక్ పర్యవేక్షణ జరుపుతోంది. వాతావరణంలో వస్తున్న ఈ అనూహ్య మార్పులు, ఎల్‌నినో సృష్టిస్తున్న కఠిన సవాళ్లు రాబోయే కాలంలో పవర్ మేనేజ్‌మెంట్‌ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News