కోర్టు ధిక్కారణ కేసు.. అనాథలకు సేవ చేయడమే శిక్ష
కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదన్న కారణంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక తహశీల్దారుకు సామాజిక సేవా చేయాలని శిక్ష విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదన్న కారణంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక తహశీల్దారుకు సామాజిక సేవా చేయాలని శిక్ష విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారంపాటు అనాథ శరణాలయంలో సేవ చేయాలని ఆదేశించిన తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక భూ వివాదానికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలేదని న్యాయమూర్తి భావించడంతో ఏలూరు జిల్లా లింగపాలెం మండల తహశీల్దార్ నజీమ్ ముల్లీసాకు ఈ శిక్ష విధించారు. ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు అనాథ శరణాలయంలో సేవ చేయాలని ఆదేశించడమే కాకుండా, సేవ చేసినట్లు రుజువులు అక్టోబరు 1వ తేదీన కోర్టుకు సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఆదేశించారు.
కోర్టు ఉత్తర్వులు అమలు చేయాని తహశీల్దార్ సామాజిక సేవతోపాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏలూరు జిల్లా సింగగూడెం పరిధిలోని ఆర్ఎస్ నంబర్ 228/1లో 1.53 సెంట్ల వ్యవసాయ భూమి పంతం శ్రీను తాత వీరయ్య నుంచి తండ్రి ముత్యాలు, అతడి సోదరుడు సుబ్బారావుకు సంక్రమించింది. అయితే వీరయ్యే పేరుతో పాస్ బుక్ జారీ కావడంతో దాన్ని రద్దు చేసి అన్నదమ్ముల వాటాల ప్రకారం కొత్త పాసుపుస్తకాలు జారీ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు ఆర్డీవో విచారణ జరిపి అన్నదమ్ముల వాటాల ప్రకారం పాసుపుస్తకాలు జారీకి ఆదేశాలిచ్చారని అంటున్నారు. ఆర్డీవో ఉత్తర్వులు తహశీల్దార్ అమలు చేయకపోవడంతో బాధితుడు శ్రీను హైకోర్టును ఆశ్రయించారని చెబుతున్నారు. కాగా, క్షేత్రస్థాయిలో విచారణ జరపగా శ్రీను కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేనందున పాసుపుస్తకాలు జారీ చేయలేదని తహశీల్దార్ కోర్టుకు నివేదించారని అంటున్నారు.
కాగా, కోర్టు పరిశీలనలో ఆర్ఎస్ నంబరు 228/2కి సంబంధించి వివాదం ఉందని, 228/1కి వివాదం లేదని నిర్ధారించినట్లు చెబుతున్నారు. దీంతో 2025 నవంబరు 17న వివాదం లేని భూమికి పాసు పుస్తకాలు జారీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసే ఉద్దేశం తనకు లేదని తహశీల్దార్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని శ్రీను మరోసారి హైకోర్టులో కోర్టు ధిక్కారణ వాజ్యం నమోదు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు తహశీల్దార్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని భావించి ఏడు రోజుల పాటు సామాజిక సేవ చేయాలని శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు.
కాగా, తహశీల్దార్ కు సామాజిక సేవ శిక్ష విధించడం హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా కోర్టు ధిక్కారణ కేసులకు ఇటువంటి శిక్షలు విధించడం జరుగుతుంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 1971లో ది కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద ఈ శిక్షలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారికి ఆరు నెలల వరకు సాధారణ జైలు శిక్ష లేదా రూ. 2,000 వరకు జరిమానా లేదా రెండూ విధించేలా నిబంధన ఉంది. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 129, ఆర్టికల్ 215 ప్రకారం కోర్టులకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టారు. దీనివల్ల న్యాయస్థానాలు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వినూత్న ఆదేశాలను జారీ చేస్తుంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ అధికారం ఉపయోగించే తహశీల్దార్ కు సామాజిక సేవ చేయాలని హైకోర్టు ఆదేశించిందని అంటున్నారు.