అపర చాణక్యమే.. ట్రంప్ ను దిగొచ్చేలా చేసిందా ?
మాయల్లేవు. మంత్రాల్లేవు. కేవలం వ్యూహమే. అదరలేదు. బెదరలేదు. వ్యూహాత్మక అడుగులు వేశారంతే. వెంటనే ట్రంప్ కు వాస్తవం బోధపడింది.;
మాయల్లేవు. మంత్రాల్లేవు. కేవలం వ్యూహమే. అదరలేదు. బెదరలేదు. వ్యూహాత్మక అడుగులు వేశారంతే. వెంటనే ట్రంప్ కు వాస్తవం బోధపడింది. దీంతో ఇండియాతో టారిఫ్ వార్ కు ఎండ్ కార్డ్ పడింది. మోదీ అనుసరించిన వ్యూహమే భారత ఎగుమతులపై టారిఫ్ లు 50 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడానికి కారణం. 500 శాతం విధిస్తామని బెదిరించిన ట్రంప్ ను.. 18 శాతానికి తీసుకొచ్చారంటే.. దాని వెనుక ఉన్నది సమయస్పూర్తితో వ్యవహరించడం, అవకాశాలను అనుకూలంగా మలుచుకోడం. ఫలితంగానే ఇండియా యూఎస్ మధ్య ఉన్న టారిఫ్ వార్ కు ముగింపు పడింది. లేదంటే ఎడతెగని వ్యవహారంగా మారేది.
ట్రంప్ వార్నింగ్..
రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా ఒత్తిడి చేసింది. కానీ భారత్ వెంటనే తగ్గలేదు. కొనుగోలు చేసింది. ట్రంప్ ఆంక్షలు విధించారు. 50 శాతం టారిఫ్ విధించారు. అయినా భారత్ వెనకడుగు వేయలేదు. పరిస్థితులను అంచనా వేసింది. పరిణామాలను ఊహించింది. సమయస్పూర్తితో వ్యవహరించింది. అమెరికా మనకెంత అవసరమో. అమెరికాకు మనం అవసరం అంతే ఉంది. అందుకే వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అమెరికాపై పూర్తీగా ఆధారపడకూడదని నిర్ణయం తీసుకుంది. మార్కెట్ రిస్క్ ను తగ్గించుకునే విధంగా డైవర్సిఫై చేయడం మొదలుపెట్టింది. కొత్త మార్కెట్ల అన్వేషణ మొదలుపెట్టింది. యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇది రెండు దేశాల దీర్ఘకాల అభివృద్ధికి చాలా కీలకం. దీంతో అమెరికాకు వాస్తవం బోధపడింది. అప్పుడు కూడా అమెరికా సైలెంట్ కాలేదు. ఇండియాతో ఈయూ డీల్ అంటే.. పరోక్షంగా రష్యాకు యుద్ధ వనరులు సమకూర్చడమే అని హెచ్చరించింది. ఈయూ కూడా అమెరికాను లెక్కచేయలేదు. అదే సయమంలో గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా తీరును తప్పుపట్టింది. ట్రంప్ వ్యవహార శైలితోనే ఈయూ, భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తొందరగా కుదిరిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికాకే నష్టం..
ఇండియాపై టారిఫ్ లు విధించడం ద్వారా అమెరికాకే నష్టం. ఎందుకంటే భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్ ఎంత అవసరమో.. అమెరికాకు ఎగుమతులకు భారత మార్కెట్ అంతే అవసరం. ప్రపంచంలో జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత మార్కెట్ లేకపోతే అమెరికా ఉత్పత్తులు అమ్ముడుపోవు. అదే విధంగా టెక్నాలజీ రంగంలో అమెరికా ఆధిపత్యం చెలాయించడానికి భారత నిపుణులే మూలాధారం. వీరు లేకుండా టెక్నాలజీ రంగంలో అమెరికా ముందుకు వెళ్లలేదు. ఆవిష్కరణలు సాధ్యం కావు. కాబట్టి ఎలా చూసినా మనలాగే అమెరికాకు అవసరాలు ఉన్నాయి. వీటిని అంచనా వేసుకుని ఇండియా ఈయూతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. తద్వార కొత్త మార్కెట్ ద్వారాలు తెరుచుకున్నాయి. మరికొన్ని దేశాలతో కూడా ఇండియా చర్చలు జరుపుతోంది. దీంతో అమెరికాపై పూర్తీ స్థాయిలో ఆధారపడాల్సిన పనిలేదు. ఇది ట్రంప్ కు అర్థమైంది. అందుకే టారిఫ్ లు తగ్గించారు.
వెంటనే తగ్గలేదు..
రష్యాతో ఆయిల్ కొనొద్దని ట్రంప్ ఒత్తిడి తెచ్చినా ఇండియా వెంటనే తగ్గలేదు. టారిఫ్ ప్రభావాన్ని భరిస్తూనే చర్చలు జరిపింది. మరోవైపు నూతన మార్కెట్లను అన్వేషించింది. క్రమంగా రష్యా ఆయిల్ కొనుగోలు తగ్గించింది. అమెరికాతో ముడిపడి ఉన్న దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించింది. ఫలితంగా ట్రంప్ దిగొచ్చారు. ఇండియా రష్యా ఆయిల్ కొనుగోలు ఆపడంతో ట్రంప్ అనుకున్నది జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య జరుగుతున్న టారిఫ్ వార్ కు ఎండ్ కార్డ్ పడింది.