రోడ్డు ప్ర‌మాదాల‌కు ప‌ర్మినెంట్‌గా చెక్.. ఇంక మీ చేతిలో ఏమీ లేదు!

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. 1 అక్టోబర్ 2028 లేదా ఆ తర్వాత తయారుచేసే అన్ని ఎల్‌, ఎం & ఎన్‌ కేటగిరీ మోటారు వాహనాల్లో వీ2వీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది.

Update: 2026-08-04 04:08 GMT

దేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు భారత కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక విప్లవాత్మక అడుగు వేసింది. మోటారు వాహనాల్లో `వెహికల్-టు-వెహికల్` (V2V) కమ్యూనికేషన్ సిస్టమ్‌ను దశలవారీగా ప్రవేశపెట్టడానికి వీలుగా 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌కు సవరణలు ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నూతన సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి వాహన తయారీదారులకు, ఇతర వాటాదారులకు అవసరమైన సమయాన్ని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. 1 అక్టోబర్ 2028 లేదా ఆ తర్వాత తయారుచేసే అన్ని ఎల్‌, ఎం & ఎన్‌ కేటగిరీ మోటారు వాహనాల్లో వీ2వీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఈ పరికరాన్ని కలిగి ఉన్న వాహనాలు 1 అక్టోబర్ 2027 నాటికే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత, అను అనుబంధ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (ఐటిఎస్‌) అప్లికేషన్ల కోసం దెబ్బతినని డిజిటల్ సిగ్నలింగ్ అందించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రత్యేకంగా 5.875 గిగాహెజ్ నుండి 5.925 గిగాహెజ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను కేటాయించింది.

సాంకేతికంగా ఈ V2V కమ్యూనికేషన్ పరికరం సమీపంలోని వాహనాల మధ్య వేగం, యాక్సెల‌రేష‌న్, ప్రయాణిస్తున్న దిశ, ప్రస్తుత లొకేషన్ వంటి కీలకమైన సమాచారాన్ని రియ‌ల్ టైమ్‌లో ఎక్స్ ఛేంజీ చేసుకోవడానికి సహాయపడుతుంది. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం.. ఎదురెదురుగా ఢీకొట్టే ప్రమాదాలు.. ప్రమాదకర రీతిలో లేన్లు మారడం లేదా అత్యవసర వాహనాలు (ఆంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు) వేగంగా వస్తున్న పరిస్థితులలో ఈ సమాచారం డ్రైవర్లను లేదా వాహన వ్యవస్థలను ముందస్తుగానే అప్రమత్తం చేస్తుంది.

సాధారణ వాహన భద్రతా వ్యవస్థలు ప్రధానంగా వాహనంపై ఉండే సెన్సార్లు, డ్రైవర్ తక్షణ స్పందనపై ఆధారపడగా..వీ2వీ సాంకేతికత మాత్రం కంటికి కనిపించని దూరంలో ఉన్న ప్రమాదకర పరిస్థితులను కూడా ముందే పసిగట్టగలదు. అందువల్ల ఇది ఆధునిక `అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్`(ఏడిఎఎస్) సాంకేతికతకు మరింత బలాన్ని చేకూరుస్తూ.. ముందస్తు ప్రమాద నివారణకు.. భవిష్యత్తులో డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యే కనెక్టెడ్ మొబిలిటీకి బలమైన పునాదిగా నిలుస్తుంది.

మొత్తానికి.. ఈ కొత్త విధానం రహదారులపై వాహనాల పరిసరాల అవగాహనను పెంచి.. వేగవంతమైన భద్రతా హెచ్చరికలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా రహదారి ప్రమాదాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా.. దేశంలో మరింత సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని సృష్టించడమే ఈ ప్రతిపాదనల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

Tags:    

Similar News