జీవన్ రెడ్డి 'ఆఖరి' అస్త్రం.. జగిత్యాలలో ఇంట్రెస్టింగ్ ఫైట్!!
జగిత్యాలలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. మెజార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ వెనకే ఉన్నారని చెబుతున్నారు.;
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సొంత నియోజకవర్గం జగిత్యాలలో పట్టు కోసం జీవన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా, జీవన్ రెడ్డి మాత్రం ఆయనతో విభేదిస్తూనే ఉన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకోడానికి సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి అలకపాన్పు ఎక్కారు. నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ కౌన్సిల్ సీట్లను కేటాయించడాన్ని జీవన్ రెడ్డి తప్పుపడుతున్నారు. తన అనుచరులు, ఓల్డ్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల రాజకీయం కాక పుట్టిస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి తొలి నుంచి ఎమ్మెల్యే సంజయ్ చేరికను వ్యతిరేకిస్తున్నారు. ప్రతి విషయంలోనూ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తూ చర్చకు ప్రధాన కేంద్రం అవుతున్నారు. సీనియర్ నేతగా జీవన్ రెడ్డిని కాదనలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం సైతం జగిత్యాల విషయంలో తప్పటడుగులు వేస్తూనే ఉందని అంటున్నారు. రాజకీయాలు వదిలేస్తానని చెబుతూనే పార్టీ హైకమాండ్ కు జీవన్ రెడ్డి తలనొప్పిగా మారుతున్నారని కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాలలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. మెజార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ వెనకే ఉన్నారని చెబుతున్నారు. కానీ, పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకుని వస్తున్నవారిలో ఎక్కువ మంది సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాదనలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరుకు పుల్ స్టాప్ పడటం లేదని అంటున్నారు. ప్రతిసారి జీవన్ రెడ్డి తన మాట నెగ్గించుకోవాలనే తాపత్రయంతో వివాదాలకు కారణమవుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అలక వహించారు. దీంతో జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉండగా, ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా అధిష్టానం వద్ద పావులు కదిపి తన వర్గానికి మెజార్టీ సీట్లు దక్కించుకున్నారు. మొత్తం రెండు మున్సిపాలిటీల్లో 62 కౌన్సిల్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 36 కేటాయించారు. జగిత్యాలలో 30, రాయికల్ లో 6 చొప్పున ఇచ్చారు. అదేవిధంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గీయులకు 26 కేటాయించారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామని పార్టీ అధిష్టానం చెప్పినా, తన వర్గానికి తక్కువ సీట్లు ఇచ్చారని జీవన్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారని అంటున్నారు.
నియోజకవర్గంలో తన మాటే చెల్లాలని జీవన్ రెడ్డి పంతం పట్టడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని రెబల్స్ గా పోటీ చేస్తామని సంకేతాలు పంపుతున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించారు. అయినా జీవన్ రెడ్డి అలక వీడలేదని అంటున్నారు. పార్టీపై ‘ఆఖరి’ అస్త్రం ప్రయోగానికి జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.