జగన్ మీద మరోసారి పవన్
ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత జగన్ మీద విమర్శల దాడిని పెంచుతున్నారు.;
ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత జగన్ మీద విమర్శల దాడిని పెంచుతున్నారు. ఆయన ఎన్నికల తరువాత పెద్దగా జగన్ మీద విమర్శలు చేసింది లేదు. తాను ఉప ముఖ్యమంత్రిగా అయిదు కీలక శాఖలలో బాధ్యతలను మోస్తూ ముందుకు సాగారు. అయితే ఏణ్ణర్థం పాలన పూర్తి అయిన నేపథ్యంలో ఇపుడిపుడే పాలన నుంచి రాజకీయాల వైపు కూటమి పెద్దలు దృష్టి సాగిస్తున్నారు. పవన్ కూడా ఇపుడు విపక్షాన్ని ఇష్యూ బేస్డ్ గా తీసుకుని విమర్శలు చేస్తున్నారు.
పరకామణితో అలా :
ఇక చూస్తే కనుక పరకామణి ఇష్యూలో జగన్ చాలా చిన్న నేరం అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటీవలనే పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చిన్న ఇష్యూ గా తీసుకుంటారా అని జగన్ మీద మండిపడ్డారు హిందువుల సెంటిమెంట్ తిరుమల అని అన్నారు. పైగా మీ మతంలో అయితే ఇంతలా చిన్నది చేసి మాట్లాడుతారా అని కూడా అన్నారు. ఆ కామెంట్స్ హీటెక్కించాయి. అయితే దానికి వైసీపీ నుంచి అంబటి రాంబాబు రెస్పాండ్ అయ్యారు. పవన్ మీద ఆయన రివర్స్ లో విమర్శించారు కూడా.
బెదిరిస్తున్నారు అంటూ :
ఇక తాజాగా మంగళగిరిలో పోలీసు కానిస్టేబుళ్ళకు నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. అంతే కాదు జగన్ మీద సైతం ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు కొందరు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్లారని అన్నారు. ఇలాంటి వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కూటమిగట్టిగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏంత్రం ఉపేక్షించదని పవన్ స్పష్టం చేశారు. దానిని చాలా బలంగా తీసుకుంటుందని అన్నారు. ఇక ఎవరూ భయపడాల్సింది అంతకంటే లేదని అన్నారు.
లా అండ్ ఆర్డర్ విషయంలో :
ఇక పోలీసులు ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు. మీరు ప్రజలకు అండగా ఉండండని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడకూడదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ప్రజల మానప్రాణ సంరక్షణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో బెట్టింగులు డ్రగ్స్ గ్రామాలకు చేరిపోయాయని అన్నారు. ఆ పరిస్థితి మారుస్తామని చెప్పారు.
జగన్ అన్న మాటలు :
ఇదిలా ఉంటే జగన్ గతంలో ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ వైసీపీ క్యాడర్ ని వేధించిన పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నా పదవీ విరమణ చేసి వెళ్ళినా వారిని వెనక్కి తీసుకుని వచ్చి చట్ట ప్రకారం నిలబెడతామని చెప్పారు. అయితే దాని మీద అప్పట్లో కూడా కూటమి నేతల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఇపుడు పవన్ మాజీ ముఖ్యమంత్రి అంటూ జగన్ పేరు చెప్పకుండా ఆయన మీద చేసిన ఈ హాట్ కామెంట్స్ తో రాజకీయంగా రచ్చ మొదలైంది. దీనికి వైసీపీ నుంచి ఏ విధమైన కామెంట్స్ వస్తాయో చూడాలి. మరో వైపు చూస్తే రానున్న రోజులలో పవన్ జగన్ కేంద్రంగా వైసీపీ టార్గెట్ గా మరిన్ని విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.