అయిదేళ్ళకు బాబు గద్దె దిగాల్సిందేనా...అది రూల్ నా ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఇంకా కేవలం మూడేళ్ళు మాత్రమే సమయం ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పక్కాగా గుర్తు చేశారు.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఇంకా కేవలం మూడేళ్ళు మాత్రమే సమయం ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పక్కాగా గుర్తు చేశారు. ఆ తరువాత సీఎం పీఠం ఎక్కేది తానే అని ఎంతో ఆత్మ విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకంటే బాబు కానీ కూటమి పార్టీ ముఖ్య నేతలు కానీ తమకు తిరుగు లేదని ఏకంగా 15 ఏళ్ళ వరకూ తామే అని చెబుతూ వస్తున్నారు. ఏపీలో అభివృద్ధి అన్నది కంటిన్యూ కావాలంటే స్టేబుల్ గా ఒకే ప్రభుత్వం కొనసాగాలని వారు అంటున్నారు. కానీ జగన్ చెప్పినది దానికి విరుద్ధంగా ఉంది. ఆరు అయినా నూరు అయినా కూటమి ఉండేది అయిదేళ్ళే అందులో రెండేళ్ళు ఖర్చు అయిపోయాయని ఒక కఠిన సత్యాన్ని ఆయన ముందు పెడుతున్నారు.
ఎందుకు ఆ ధీమా :
వైసీపీ అధినేత జగన్ ఎందుకు ఈ మాటను ఒకటికి పదిసార్లు చెబుతున్నారు అన్నది చూస్తే దాని వెనక ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అలాగే పొలిటికల్ ట్రాక్ రికార్డు కూడా ఉంది. దాన్ని బట్టే ఈ మాట అనగలుగుతున్నారు అనుకోవాలి. ఉమ్మడి ఏపీలో చూసినా విభజన ఏపీలో చూసినా ఒక పార్టీకి ఒక టెర్మ్ మాత్రమే జనాలు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ 1983లో పుట్టాక అధికార మార్పిడి ప్రతీ అయిదేళ్ళకు ఒకసారి జరుగుతోంది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1984లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఎపిసోడ్ జరగకపోయి ఉంటే కచ్చితంగా 1988కి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. సానుభూతి కారణంగా 1985లో ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. ఈ మాట అప్పట్లోనూ చాలా మంది కాంగ్రెస్ నేతలు అనుకుని మధన పడ్డారు కూడా. ఇక 1989లో ఎన్టీఆర్ కూడా ఓటమి పాలు అయి పార్టీ ఓడింది. 1994లో మళ్లీ కాంగ్రెస్ ని ఓడించి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. అయితే 1999లో చంద్రబాబు సీఎం గా ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. అయితే దీనికి కూడా ఒక విశ్లేషణ ఉంది. ఎన్టీఆర్ కనుక అయిదేళ్ళూ పాలించి జనం ముందుకు వస్తే ఓటమి జరిగేదని, బాబు కొత్త ముఖ్యమంత్రిగా నాయకుడిగా రాబట్టే ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇచ్చారూ అని.
ఆ విధంగానే :
ఇక 2004లో వైఎస్సార్ గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో అయితే కాంగ్రెస్ ఓడాల్సిందే. కానీ మధ్యలో ప్రజారాజ్యం అలాగే లోక్ సత్తా పార్టీలు వచ్చి ఓట్ల చీలిక జరిగి బొటాబొటీన కాంగ్రెస్ గెలిచింది. ఒక విధంగా అయితే కాంగ్రెస్ గెలిచి ఓడింది. టీడీపీ 90కి పైగా అసెంబ్లీ సీట్లు సాధించి ఆ ఎన్నికలో గెలిచి ఓడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక 2014లో టీడీపీ గెలిస్తే వైసీపీ ఓడింది, 2019లో వైసీపీ గెలిచి టీడీపీ ఓడింది. 2024లో వైసీపీ ఘోరంగా ఓడింది. ఇలా నాలుగున్నర దశాబ్దాలా ఏపీ చరిత్ర తీసుకుంటే జనాలు ఒక పార్టీని ఒక టెర్మ్ కే అన్నట్లుగా ఫిక్స్ చేశారు. అందుకే జగన్ ఈ మాట అనగలుస్తున్నారు అంటున్నారు.
సౌత్ లో అదే సీన్ :
ఈ విధమైన అధికార మార్పిడి కేవలం ఏపీకి మాత్రమే కాదు దక్షిణ భారత దేశం అంతటా ఉన్న రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడైనా ఒకటి రెండు సందర్భాలలో తప్పించి ఒకే పార్టీకి ఏకంగా పదిహేనేళ్ళు పట్టం కట్టే పరిస్థితి ఎక్కడా లేదు, తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకేల మధ్య, కర్ణాటకలో కాంగ్రెస్ జనతాదళ్, ఆ తరువాత జేడీఎస్ బీజేపీ ఇలా అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కేరళలో ఒక తడవ లెఫ్ట్ కూటమి మరో సారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. దీనికి కారణం దక్షిణ భారత దేశంలో రాజకీయ చైతన్యం అధికంగా ఉండడం అదే విధంగా ప్రజల ఆలోచనలు ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉండడం అని చెప్పాల్సి ఉంది. ఉత్తరాదిన గుజరాత్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో అయితే ఒకే పార్టీకి హెచ్చు సార్లు అధికారం ఇస్తారు కానీ సౌత్ లో అది పెద్దగా వర్కౌట్ అయ్యేది లేదని అంటున్నారు. అందుకే జగన్ ధీమాగా చెబుతున్నారు. మరి కూటమి సెకండ్ టైం రిపీట్ అన్న మ్యాజిక్ ని సాధిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.