బాబును తిడుతూ పవన్ పేరు ఎత్తకుండా జగన్ లౌక్యం!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారా? గతానికి భిన్నంగా ఆయన పొలిటికల్ ప్లానింగ్ లో మార్పులు చేసుకున్నారు.;
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారా? గతానికి భిన్నంగా ఆయన పొలిటికల్ ప్లానింగ్ లో మార్పులు చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు విమర్శలు టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేస్తే.. జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి కనీసం రెండు విమర్శలైనా పడేవి. అందుకు భిన్నంగా తాజాగా జగన్ తీరు ఉండటం గమనార్హం.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై ఇటీవల వెలువడిన రిపోర్టులోని అంశాల్ని లేవనెత్తుతూ మాజీ మంత్రి అంబి రాంబాబు ఆగ్రహాం వ్యక్తం చేయటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే.. ఇతర నేతలు అంబటి నివాసంపై దాడి చేయటం.. నిప్పు పెట్టటం లాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించి అంబటిని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు రావటం తెలిసిందే.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే వచ్ేది తమ ప్రభుత్వమేనని.. అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్న ఆయన.. ‘‘అన్నీ విచారణ చేయిస్తాం. కోర్టు బోను ఎక్కిస్తాం. ఇప్పుడు తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టం. అంబటి.. జోగి ఇళ్లపై విధ్వంసకాండ, నిప్పు పెట్టటం దారుణం’’ అని మండిపడ్డారు.
ఇలాంటి ఉదంతాలు మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని.. కచ్ఛితంగా ప్రతిఘటన ఉంటుందన్న జగన్.. ‘‘అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తాం. అప్పటికి ఆపకపోతే అడుగులు వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఎన్ హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీం తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం’ అంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బిహార్ లో ఏం జరుగుతుందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి దాదాపు 200 మంది సీఐలు.. ఎస్ఐలు.. డీఎస్పీలను కూటమి సర్కారు పక్కన పెట్టిందన్నారు.
వైసీపీపై దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు కంటే మూర్ఖుడు ఇంకొకరు లేనట్లేనని.. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా తమ కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారన్నారు. తీవ్రమైన ఆగ్రహంతో సీఎం చంద్రబాబును..ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్.. ఏ సందర్భంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరును కానీ.. ఆయన ప్రస్తావన కానీ తీసుకురాకపోవటం చూస్తే.. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా భావించాలి.
నిజానికి తాను అధికారంలో ఉన్నప్పుడు అవసరం ఉన్నా లేకున్నా జనసేనాని ప్రస్తావన తీసుకొచ్చి.. ఆయన్ను రాజకీయ పరంగా..వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు. ఈ తీరుకు భిన్నంగా జగన్ తాజా వ్యవహారశైలి ఉండటం గమనార్హం. ఇదంతా చూస్తే.. ఎవరైతే తమను.. తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తారో వారి మీదనే తప్పించి.. అవసరం లేకున్నా విమర్శలు చేయాలన్న ఆలోచన తమకు లేదన్న విషయాన్ని జగన్ తాజాగా తన తీరుతో చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. ఈ తీరు రాజకీయంగా కలిసి వస్తుందని చెబుతున్నారు. చంద్రబాబును అదే పనిగా విమర్శలు చేసినంత మాత్రాన పవన్ కల్పించుకోరు. సంబంధం లేని అంశాల్లోకి పవన్ ను లాగటం ద్వారా.. ఆయన స్పందించే వీలు ఉంటుంది. అందుకే.. తాజా ఎపిసోడ్ తో ఏ మాత్రం సంబంధం లేని జనసేనతో పాటు బీజేపీ ప్రస్తావన తేకుండా జగన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఒకట్రెండు సందర్భాల్లో పవన్ ప్రస్తావన వచ్చినా పాసింగ్ కామెంట్ మాదిరే తప్పించి వేలెత్తి చూపించింది లేదు. ఈ తీరును రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తారా? లేదా? అన్నది కాలమే చెప్పాలి.