ఏఐ ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కొడుకు
ఏఐ రాకతో వైట్ కాలర్ ఉద్యోగాల తొలగింపు అనివార్యంగా మారుతోంది. టెక్ సంస్థల్లో ఇప్పటికే ఈ పరంపర కొనసాగుతోంది.;
ఏఐ రాకతో వైట్ కాలర్ ఉద్యోగాల తొలగింపు అనివార్యంగా మారుతోంది. టెక్ సంస్థల్లో ఇప్పటికే ఈ పరంపర కొనసాగుతోంది. ఇప్పుడు మీడియా సంస్థలకు కూడా పాకింది. అమెరికన్ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. అందులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఇషాన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ప్రభావం ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్ విప్లవంతో వైట్ కాలర్ ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇప్పుడు ఏఐ రాక వైట్ కాలర్ ఉద్యోగాలను తగ్గించి, బ్లూకాలర్ ఉద్యోగాలకు డిమాండ్ పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఏఐతో లే ఆఫ్స్ ..
ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మనిషి చేయాల్సిన పనిని ఏఐ టెక్నాలజీ తక్కువ ఖర్చుతో, వేగంగా చేయగలుగుతుంది. కాబట్టి కంపెనీలు ఉద్యోగులను తొలగించి, ఏఐపై పెట్టుబడి పెడుతున్నాయి. దీంతో పాటు కంపెనీలకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా ఉద్యోగులను తొలగించడానికి కారణం అని తెలుస్తోంది. ఉద్యోగుల జీతాల మీద కంపెనీల భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగుల స్థానాన్ని ఏఐ టెక్నాలజీ భర్తీ చేస్తోంది. ఫలితంగా కంపెనీల ఖర్చు కూడా తగ్గుతోంది. ఫలితంగా కంపెనీపై ఆర్థిక భారం తగ్గుతుంది. అదే సమయంలో తక్కువ ఖర్చుతో పనిని పూర్తీ చేసుకోవచ్చు. అందుకే కంపెనీలు ఏఐపై పెట్టుబడులు పెట్టి, ఉద్యోగులను తొలగిస్తున్నారు.
ఐటీ విప్లవం తరహాలో..
ఐటి విప్లవం మానవ గతిని మార్చింది. కంప్యూటర్లు మనిషి చేయాల్సిన పనిని అంతే ఖచ్చితత్వంతో, వేగంగా చేసి.. మనిషిపై భారాన్ని తగ్గించాయి. అన్ని రంగాలు ఆ మార్పును స్వాగతించాయి. కొత్త ఉద్యోగాలు వచ్చాయి. వైట్ కాలర్ ఉద్యోగాలు సృష్టించి, మధ్యతరగతి వర్గం పెరగడంలో ఐటీ విప్లవం కీలక భూమిక పోషించింది. అయితే ఏఐ పై జరుగుతున్న ప్రచారాన్ని పరిశీలించినప్పుడు.. ఐటీ విప్లవానికి భిన్నంగా ఏఐ విప్లవం ఉన్నట్టు కనిపిస్తుంది. ఐటీ వైట్ కాలర్ ఉద్యోగాలను సృష్టిస్తే.. ఏఐ ఆ వైట్ కాలర్ ఉద్యోగాలను తగ్గిస్తోందన్న ప్రచారం ఉంది. అదే సమయంలో బ్లూకాలర్ ఉద్యోగాలకు డిమాండ్ పెంచుతోంది. దీనివల్ల సామాజిక, ఆర్థిక మార్పులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు.
వైట్ కాలర్ ఉద్యోగులు పరిస్థితికి తగ్గట్టు మారకపోతే.. ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. వీరు బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయలేరు. అలా అని ఖాళీగా ఉండలేరు. కాబట్టి ఏఐను తమకు అనుకూలంగా అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. ఐటీ విప్లవం మధ్యతరగతి వర్గం పెరగడంలో కీలక పాత్రపోషిస్తే.. ఏఐ పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో ఆర్థిక మార్పులకు కారణమవుతుందన్న విశ్లేషణ ఉంది. ఎందుకంటే.. బ్లూకాలర్ ఉద్యోగాలను ఐటీ ఉద్యోగులు చేయలేరు. అదే సమయంలో ఇప్పటి వరకు వైట్ కాలర్ ఉద్యోగాలు చేయని వారికి బ్లూకాలర్ ఉద్యోగాలు ద్వారా ఉపాధి దక్కుతుంది. ఫలితంగా సామాజిక, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు.