'ఎవడికి రా నువ్వు జాతిపితవు?' డైరెక్టుగా ఏసుకున్న సీఎం రేవంత్

ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన తూటాల్లాంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.;

Update: 2026-02-05 05:25 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉగ్రరూపాన్ని చూపారు. కొద్దిరోజులు విదేశాల్లో ఉండి..ఈ వారం మొదట్లో రాష్ట్రానికి చేరుకున్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో తనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన ఆయన మిర్యాలగూడలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన తూటాల్లాంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. షాకిచ్చే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మొగుడూ పెళ్లాలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. వాళ్ల బతుకు చెడ. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు.. ఎవరి ఫోన్లు వదల్లేదు. మంది ఫోన్లు వినే వాడు మనిషేనా? అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే.. జాతిపితకు నోటీసులు ఇస్తారా? అంటున్నారు. ఎవడికి రా నువ్వు జాతిపితవు? వినోదరావు, దయాకర్ రావు, హరీశ్ రావు, కూకట్ పల్లి క్రిష్ణారావుకు అయితే జాతిపితవేమో కానీ మా నల్గొండ, పాలమూరు వాళ్లకు నువ్వెందుకు జాతిపితవు అవుతావు? మంది ఫోన్లు వినడం వంటి క్రూరమైన, ఘోరమైన నేరం చేసిన నువ్వెలా జాతిపితవు అవుతావు’’ అంటూ నాన్ స్టాప్ గా బండకేసి బాదినట్లుగా విమర్శల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తే.. మళ్లీ మరోసారి కేసీఆర్ పేరుకు ముందు జాతిపిత అన్న పదాన్ని పెట్టేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నట్లుగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. క్షమాపణలు అడగాల్సిందిపోయి సిగ్గులేని మాటలా? అంటూ ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణకు హరీశ్, కేటీఆర్ ముఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకురావాల్సిందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము జానారెడ్డి అంత మంచివాళ్లం కాదన్న ముఖ్యమంత్రి రేవంత్.. ‘తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ఫ్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు. కేంద్రంలో అధికారం కోల్పోతామని.. తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీ లేకుండా పోతుందని.. తెలంగాణలో అధికారంలోకి రాదని తెలిసినప్పటికీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియా జాతిపిత అవుతారు, జాతిపిత కావటానికి తెలంగాణకు ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు.

వేల కోట్ల రూపాయిల విలువ చేసే జున్వాడ, ఎర్రవెల్లి ఫాంహౌస్.. మొయినాబాద్ లోని హరీశ్ రావు ఫాంహౌస్, మీ టీవీలు, పేపర్లు. వేలాది కోట్లతో నిర్మించుకున్న పంజాగుట్ట గడీని తెలంగాణ సమాజానికి ఇస్తారా? తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదని.. చిన్న అధికార బాధ్యత కూడా ఆమెకు ఇవ్వలేకపోయిన మీకు జాతిపిత అర్హత ఎక్కడిది?’’ అంటూ సూటిగా నిలదీశారు.

తెలంగాణను దోచుకున్న దొంగలు.. లుచ్చాలు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాపై కక్ష..కసిపెంచుకొని ఇక్కడి ప్రాజెక్టులను పడావు పెట్టారన్నారు. సమైక్య రాష్ట్రంలో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాడి తెచ్చిన ఎస్ ఎల్ బీసీ సొరంగాన్ని పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదని. కక్షతోనే ఈ పనులు చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ ఎల్ బీసీ పనులు చేయిస్తుంటే.. అనూహ్య రీతిలో ప్రమాదం జరిగిన కార్మికులు చనిపోయారని.. ఈ సందర్భంగా కనీస మానవత్వం లేకుండా మామా అల్లుళ్లు, బావాబామ్మరదులు ఎస్ఎల్ బీసీ ఆగిపోయిందని సంబరపడ్డారంటూ ఆరోపించారు.

నల్గొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ ను గెలిపిస్తారన్న విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదన్న సీఎం రేవంత్.. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్సే గెలవాలన్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారన్న సీఎం రేవంత్.. ‘‘ఆయన నక్కజిత్తులు నడవవు. ఆయన వీపు చింతపండు చేయటం పక్కా. జానారెడ్డి సొంత కొడుకును పక్కన పెట్టి ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేను చేయిస్తే. ఎర్రవెల్లికి వెళ్లి మోకరిల్లాడు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించేందుకు ఇంటింటికి తిరిగాడన్న సీఎం రేవంత్.. తాము జానారెడ్డి అంత మంచివాళ్లం కాదంటూ.. ‘‘కాంగ్రెస్ శ్రేణుల జోలికి వస్తే వీపు చింతపండు చేస్తామంటూ నేరుగా వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. మొత్తంగా.. మున్సిపల్ ఎన్నికల వేళ.. సీఎం రేవంత్ తన ఆగ్రహం పాళ్లను మోతాదు పెంచిన వైనం ఆయన తాజా స్పీచ్ ను చూస్తే అర్థమవుతుంది.

Tags:    

Similar News