పని ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాదీ టెకీ సూసైడ్
అయితే.. ఇటీవల కాలంలో పని ఒత్తిడి భారీగా పెరిగిపోతున్న దుస్థితి. దీన్ని డీల్ చేసే విషయంలో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు.;
ఒక విషాదం ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తోంది. ఐటీ ఉద్యోగి అన్నంతనే భారీ జీతాలు.. కొత్త అల్లుడ్ని చూసుకునే అత్తారిల్లు మాదిరి పని చేసే కంపెనీలు ఉంటాయన్నది పాతమాట. కరోనాకు ముందు నుంచే ఈ తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా మారింది. దీనికి తోడు ఇటీవల కాలంలో ఏఐ ఎంట్రీ ఇస్తూ.. పలు కంపెనీల ఉనికికే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల్లో పని ఒత్తిడి భారీగా పెరిగింది. మిగిలిన రంగానికి ఐటీ రంగానికి ఉన్న ఒక పెద్ద వ్యత్యాసం.. ఐటీ ఉద్యోగి ఎప్పటికప్పుడు తనను తాను సబ్జెక్టులో అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే అతని ఉద్యోగ ఆయుష్షు మరింతకాలం పెరుగుతుంది.
అయితే.. ఇటీవల కాలంలో పని ఒత్తిడి భారీగా పెరిగిపోతున్న దుస్థితి. దీన్ని డీల్ చేసే విషయంలో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరైతే ఆ ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది మియాపూర్ కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి సూసైడ్ ఉదంతం. షాకింగ్ గా మారిన ఈ ఉదంతలోకి వెళితే.. ఏపీలోని అమలాపురం ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల సతీష్ గచ్చిబౌలిలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు.
ఏడాది క్రితం అతనికి పెళ్లైంది. తన సోదరుడితో కలిసి మియాపూర్ లోని బీకే ఎన్ క్లేవ్ లో సతీష్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. పని ఒత్తిడి తట్టుకోలేక తాజాగా తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గామారింది. సంక్రాంతి సెలవులకు భార్య పుట్టింటికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. అదే సమయంలో పని ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ విషాద ఉదంతం అందరిని కలిచివేస్తోంది.