జంపింగులకు మోడీ అభయం.. ఎలాంటి సందేశం ఇస్తున్నారు?
ఇటీవల రెండు నెలల కాలంలో తమ సొంత పార్టీలను వదిలేసి.. ఎన్డీయే కూటమికి, బీజేపీకి మద్దతు తెలుపుతున్న ఎంపీల సంఖ్య 24కు చేరింది.
ఇటీవల రెండు నెలల కాలంలో తమ సొంత పార్టీలను వదిలేసి.. ఎన్డీయే కూటమికి, బీజేపీకి మద్దతు తెలుపుతున్న ఎంపీల సంఖ్య 24కు చేరింది. మహారాష్ట్రలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే పార్టీ శివసేన నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు.. మరో మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు తెలిపారు. అలానే.. ఒక ఎంపీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ నుంచి బయటకు వచ్చి ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలిపారు. ఇక, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన దరిమిలా.. ఆమె పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు బీజేపీకి అనుకూలంగా మారారు.
వీరంతా నేరుగా బీజేపీలో చేరలేదు. కానీ, ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్న ట్టు బహిరంగ ప్రకటన చేశారు. అంతేకాదు.. తమకు వేరుగా కుర్చీలు వేయాలంటూ.. పార్లమెంటు స్పీకర్‌కు విన్నవించారు. వీరి విజ్ఞాపన మేరకు స్పీకర్ కూడావారికి ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఈవ్యవహారం.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను భారీ ఎత్తున కుదిపివేస్తోంది. నీట్ సహా.. ఎంపీల జంపింగు, వారికి పార్లమెంటులో ప్రత్యేక కుర్చీలు వేయడం వంటివాటిని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. నిజానికి ప్రజాప్రాతినిధ్యచట్టం ప్రకారం ఒకపా ర్టీ నుంచి విజయం దక్కించుకుని వేరే పార్టీకి మద్దతు తెలిపేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిణామాలు ఇలా సాగుతుంటే.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. రోజు ఉదయా న్నే ఆయన జంపింగు ఎంపీలతో భేటీ అవుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పేరుతో వీరిని పిలిచి.. తనదైన శైలిలో వారికి ధైర్యం చెబుతున్నారు. ``నేనున్నాను. మీరు భయ పడవద్దు. `` అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు.. వారికి కొసరి కొసరి.. అల్పాహారం వడ్డించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేసిన నేతలను ప్రధానులు పట్టించుకునేవారు. అంతేకాదు.. వీరి పట్ల సదభిప్రాయం కూడా ఉండేది కాదు.
ఎందుకంటే.. ప్రజలు ఇచ్చిన తీర్పును వారు తుంగలో తొక్కారన్న భావన ఉండడమే. కానీ.. ప్రస్తుతం సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీనే జంపింగులకు నేనున్నానంటూ.. అభయం ప్రసాదించడం..వారితో బ్రేక్ ఫాస్టు మీటింగులు పెట్టి.. అభినందించడం వంటివాటిని ప్రజాస్వామ్య వాదులు.. ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాలకు ప్రధాని మోడీ ఎలాంటి సందేశం ఇస్తున్నారని? వారు నిలదీస్తున్నారు. ఇది సరైన విధానం కాదని.. విశ్వగురు కీర్తికి అపకీర్తి తెస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. ఇక, ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు మరింత మండిపడుతున్నాయి. ఒకవైపు చర్యలు తీసుకోవాలనితాము కోరుతుంటే.. జంపింగులను అక్కున చేర్చుకుని అభయం ప్రసాదించడం ఏంటని నిప్పులు చెరుగుతున్నారు.