ఇయర్ ఎండింగ్ లో జగన్ మెరుపులు
మరి కొద్ది రోజులలో 2025 ఏడాది ముగుస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. క్యాలెండర్ లో 2025 కరిగి కాలగర్భంలో కలిసి పోవడానికి అతి తక్కువ సమయమే ఉంది.;
మరి కొద్ది రోజులలో 2025 ఏడాది ముగుస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. క్యాలెండర్ లో 2025 కరిగి కాలగర్భంలో కలిసి పోవడానికి అతి తక్కువ సమయమే ఉంది. ఇదిలా ఉంటే 2025 రాజకీయం అంతా ఏకపక్షంగానే సాగింది అని అంటున్నారు. ఈ ఏడాది కూటమి బాగానే రాజకీయ ప్రదర్శన చేసింది. జగన్ అయితే అడపా తడపా జనంలోకి వచ్చారు. ఆయన ఎక్కువగా రైతుల విషయంలో పరామర్శలు చేశారు. అదే విధంగా తమ పార్టీ నేతలు జైలుపాలు అయినపుడు వారిని ములాఖత్ ద్వారా కలసి ఆ మీదట అలా జనంతో కనిపించారు. ఇక జగన్ ఎక్కువగా తిరిగింది కూడా గుంటూరు విజయవాడ మధ్యనే అని గుర్తు చేస్తున్నారు.
విజయవాడలో అక్కడ :
ఇక ఈ ఏడాది చివరిలో జగన్ జనంతో మమేకం అవుతూ నిర్వహించిన మరో కార్యక్రమంగా విజయవాడలోని జోజినగర్ లో 42 ప్లాట్ల కూల్చివేతకు గురి అయిన బాధితులను పరామర్శించారు. వారికి వారికి వైసీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతే కాదు న్యాయ సహాయం అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీద కూడా జగన్ విమర్శలు చేశారు.
అంతా కొత్త ఏడాదే :
ఇలా చాలా కాలానికి జగన్ జనంలోకి వచ్చారు అని అంటున్నారు. ఆయన ఈ మధ్యనే పులివెందులలో రైతులను పరామర్శిస్తూ వారి పొలాల వద్దకు వెళ్ళి వచ్చారు. అలాగే మోత్వా తుఫాను సమయంలో ఉమ్మడి క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. దాని కంటే ముందు విశాఖ జిల్లా నర్శీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కలాశాలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఉద్యమించారు. తాము అప్పట్లో కట్టించిన మాకవరపాలెం కళాశాలను ఆయన సందర్శించారు. ఇక చిత్తూరులోని బంగారుపాళ్యెంలో మామిడి రైతుల పరామర్శ అదే విధంగా నెల్లూరు జిల్లా పర్యటన వంటివి జగన్ ఈ ఏడాది చేపట్టారు. ఇక మిగిలినది అంతా కొత్త ఏడాదిలోనే అని వైసీపీ నేతలు అంటున్నారు.
జనంలోనే అంటూ :
అదే విధంగా చూస్తే 2026 లో జగన్ పూర్తిగా జనంలోనే ఉంటారు అని అంటున్నారు. ఆయన వివిధ మార్గాల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా జనంలోకి వచ్చేందుకు పార్టీ భారీ యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తోంది అని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే 2025 ఇయర్ ఎండింగులో జగన్ విజయవాడ పర్యటన ఒక కీలక మలుపుగా మెరుపుగా చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలలో టీడీపీకి ఎంతో బలం ఉంది. అలాంటి చోట తనకు ఉన్న జనాదరణను కూడా వైసీపీ కార్యక్రమాలు ద్వారా చూపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ నెలలో కొద్ది రోజులు మాత్రమే ఉంది కాబట్టి జగన్ మరోసారి జనంలోకి ఈ ఏడాది అయితే పెద్దగా వచ్చే అవకాశాలు అయితే లేవనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. కొత్త ఏడాది వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు ప్లాన్స్ ఏ విధంగా ముందుకు సాగుతాయో.