ట్రంప్ కు షాకిస్తూ గూగుల్ సంచలనం.. భారత్ కు ఇదో కలిసివచ్చే వరం

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ టెక్ కారిడార్‌లో ఉన్న అలెంబిక్ సిటీ లో గూగుల్ ఏకంగా మూడు భారీ ఆఫీస్ భవనాల కోసం లీజు ఒప్పందాలు కుదుర్చుకుంది.;

Update: 2026-02-04 18:30 GMT

ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు భారతీయ టెక్ రంగానికి శాపమా? లేక వరమా? అంటే.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది 'వరమే' అనిపిస్తోంది. అమెరికాలో పెరుగుతున్న హెచ్1బీ ఆంక్షల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారత్‌లో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.టెక్ హబ్ బెంగళూరు వేదికగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చేపట్టిన ఈ భారీ ప్రణాళికల వివరాలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో గ్లోబల్ టెక్ కంపెనీలకు టాలెంట్‌ను అమెరికాకు తరలించడం భారంగా మారింది. దీనికి విరుగుడుగా ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికే కార్యాలయాలను తీసుకెళ్లాలని గూగుల్ నిర్ణయించుకుంది.

24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ టెక్ కారిడార్‌లో ఉన్న అలెంబిక్ సిటీ లో గూగుల్ ఏకంగా మూడు భారీ ఆఫీస్ భవనాల కోసం లీజు ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 2.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ విస్తరించి ఉండనుంది. ఇందులో ఒక భవనం ఇప్పటికే సిద్ధంగా ఉండగా మిగిలిన రెండు 2026 నాటికి పూర్తికానున్నాయి.

20 వేల కొత్త ఉద్యోగాలు

ఈ విస్తరణ ద్వారా గూగుల్ భారత్‌లో తన ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తోంది. ఈ కొత్త క్యాంపస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 20,000 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి రంగాల్లో ఈ నియామకాలు ఉండవచ్చని అంచనా.

ట్రంప్ 'హెచ్1బీ కట్టడి'.. భారత్‌కు ఎలా కలిసొస్తోంది?

అమెరికాలో "బై అమెరికన్, హైర్ అమెరికన్" నినాదం బలపడటంతో కంపెనీలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజులు, ఇతర చట్టపరమైన ఖర్చులు భారీగా పెరిగాయి. కనీస వేతనాల పెంపు, కఠినమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ నియామకాలను ఆలస్యం చేస్తోంది. అమెరికాలో ఒక ఇంజనీర్‌కు చెల్లించే జీతంతో పోలిస్తే భారత్‌లో అంతకంటే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిని తక్కువ ఖర్చుతో నియమించుకునే వీలుంది. "ట్రంప్ వీసా ఆంక్షలు విధించడం వల్ల టెక్ దిగ్గజాలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. టాలెంట్‌ను అమెరికా తీసుకెళ్లడం కంటే టాలెంట్ ఉన్న చోటకే (భారత్) పనిని తీసుకురావడం ఉత్తమమని భావిస్తున్నాయి అని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.

భారత్.. గ్లోబల్ టెక్ హబ్!

కేవలం గూగుల్ మాత్రమే కాదు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర సంస్థలు కూడా తమ గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ ను కూడా భారత్‌లో విస్తరిస్తున్నాయి. ట్రంప్ విధానాల వల్ల అమెరికాకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటే భారత్ మాత్రం "గ్లోబల్ ఆపరేషన్ హబ్‌"గా అవతరిస్తోంది. బెంగళూరులో గూగుల్ చేపట్టిన ఈ భారీ విస్తరణ భారత ఆర్థిక వ్యవస్థకు, నిరుద్యోగ యువతకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

Tags:    

Similar News