అక్రమంగా అమెరికాలో ఉంటూ ఫ్లైట్ జర్నీలో అతి చేసిన భారతీయుడు
తన ఫ్లైట్ జర్నీలో భాగంగా తాను నిద్ర పోతున్నట్లుగా నటిస్తూ.. పక్కనున్న ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.;
బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. అతి చేసిన ఒకడి వ్యవహారం ఇప్పుడు కఠిన శిక్ష వరకు విషయం వెళ్లేలా చేసింది. దేశం కాని దేశానికి వెళ్లినప్పుడు అక్కడి కల్చర్.. సంప్రదాయాల్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ.. వారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. కోరి కష్టాల్ని కొని తెచ్చుకున్నట్లే. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అమెరికాలోని ఒక భారతీయుడు.
అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న ఇతగాడు.. ఆ మధ్యన చేసిన చెత్తపనిని అమెరికా కోర్టు తన విచారణలో నిర్దారించటమే కాదు.. అతడికి శిక్ష ఖరారు చేయనుంది. 38 ఏళ్ల వరుణ్ అరోరా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నాడు. 2024 ఆగస్టులో రోడ్ ఐలాండ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ విమానాశ్రయానికి వెళ్లాడు.
తన ఫ్లైట్ జర్నీలో భాగంగా తాను నిద్ర పోతున్నట్లుగా నటిస్తూ.. పక్కనున్న ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాధితురాలు పలుమార్లు అతడ్ని హెచ్చరించినా అతను మాత్రం తన చెత్తబుద్ధిని కంటిన్యూ చేసుకుంటూ పోయాడు. చివరి వరకు భరించిన బాధితురాలు.. విమానం గమ్యస్థానం చేరుకున్న తర్వాత సదరు వ్యక్తి ఫోటో తీసి.. విమానయాన సంస్థకు కంప్లైంట్ చేసింది.
దీంతో ఎఫ్ బీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది ఆగస్టులో అతడ్ని అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన ఫెడరల్ జిల్లా న్యాయమూర్తి అతడ్ని దోషిగా నిర్దారించారు. అతడికి శిక్షను త్వరలోనే ఖరారు చేయనున్నారు. విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా వ్యవహరించిన కేసులో అతడికి రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. చెత్త పనులు చేసినందుకు ఆ మాత్రం శిక్ష పడటంలో తప్పు లేదు.