బీజేపీ ప్రెసిడెంట్ కి సొంత సీటు లేదా...మరి ఎలా ?
ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అంటే కూటమిలో జూనియర్ పార్టనర్ గానే అని అంటున్నారు.
ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అంటే కూటమిలో జూనియర్ పార్టనర్ గానే అని అంటున్నారు. తాజాగా స్థానిక సంస్థలకు సంబంధించి కూటమి సీట్ల పంపిణీ మీద ఒక నిష్పత్తి బయటకు వచ్చింది. టీడీపీకి 80 శాతం జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం సీట్లు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తారు అన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే ఇది అఫీషియల్ గా కాదు, అలా ప్రచారం అవుతూ వచ్చింది. దానికే జనసేన భగ్గుమంది. ఏకంగా జనసేన పార్టీలో నంబర్ టూగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అది ఆమోదయోగ్యం కాదని అంటూ బాహాటంగానే చెప్పారు. జనసేన 2024 తో పోలిస్తే బాగా బలపడింది అని కూడా చెప్పారు. అంతే కాదు 2024 లెక్కలు వేరు ఇపుడు లెక్కలు వేరు అని కూడా వివరించే ప్రయత్నం చేశారు. జనసేన సంగతి ఇలా ఉంటే బీజేపీ మ్యాటర్ ఏంటి అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.
డిమాండ్ చేసేందుకు రెడీనా :
బీజేపీ నేతలు కూడా తమకు ఎక్కువ సీట్లు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అదంతా అంతర్గతంగానే ఉంది. బాహాటంగా ఆ పార్టీ అయితే తనకు 5 శాతం సీట్లు ఇస్తామని అన్నా ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఇక రెండేళ్ల కూటమి భాగస్వామ్యంతో అధికారంలో ఉంటూ బీజేపీ ఏమైనా బలపడిందా అన్నది చూస్తే కనుక పెదవి విరుపు జవాబుగా వస్తోంది అని అంటున్నారు. బీజేపీకి ఈ మధ్యలో ఇద్దరు అధ్యక్షులు మారారు. పురంధేశ్వరి తరువాత పీవీఎన్ మాధవ్ వచ్చారు. ఆయన యువ నేత, బీసీ నాయకుడు పార్టీని దూకుడుగా ముందుకు నడిపిస్తారు అని ఆశ పడిన వారికి బీజేపీ తీరు అయితే ఇంకా అర్ధం కావడం లేదని అంటున్నారు.
ఎమ్మెల్యేగా పోటీకి అయినా :
ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ ఉత్తరాంధ్ర నేపథ్యం ఉన్న వారు. విశాఖ వాసి. అయితే ఆయన ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2017లో పోటీ చేసి టీడీపీ మద్దతుతో గెలిచారు. 2023లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు. ఇక ఆయన 2029 లో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలి అంటే ఎక్కడ నుంచి చేస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయనకంటూ సొంత సీటు అయితే ఇప్పటి దాకా గుర్తించి అక్కడ బలోపేతం చేసుకోలేకపోయారు అన్న చర్చ ఉండనే ఉంది.
ఉత్తరం వైపు ఫోకస్ పెట్టినా :
ఇక 2014 ఎన్నికల్లో మాధవ్ విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు అంటారు. అయితే లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్ తో ఆ సీటు విష్ణు కుమార్ రాజుకు వెళ్ళింది. ఆయన గెలిచారు. 2019లో ఓడినా 2024లో మళ్ళీ అదే సీటు నుంచి గెలిచారు. ఇక 2029లో తన వారసురాలిని రంగంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి అక్కడ మాధవ్ పోటీ చేయడానికి వీలు ఉంటుందా ఒకవేళ చేయాలని అనుకుంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని అంటున్నారు.
ఏపీలో బలోపేతం చేయాలంటే :
అలాగే ఎంపీగా పోటీ చేయాలనుకుంటే అనకాపల్లి లేదా విశాఖ సీట్లలోనే అవుతుంది. కానీ విశాఖ టీడీపీ వదులుకోదు, అనకాపల్లిలో సీఎం రమేష్ ఉన్నారు. ఆయనే మరోసారి పోటీ చేస్తారు అని అంటున్నారు. మరి మాధవ్ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది అన్నది అయితే ఇప్పటికి తెలియడం లేదు అని అంటున్నారు. బీజేపీని ఏపీలో బలోపేతం చేయాలంటే పార్టీని పరుగులు తీయించాలంటే ప్రెసిడెంట్ నుంచి కీలక నేతలు తమ సొంత నియోజకవర్గాలలో పార్టీని ముందు గట్టిగా ఉంచుకుంటే ఆ మేరకు కమలం పార్టీకి రెండు డజన్ల చోట్ల బలం పెరుగుతుంది కదా అన్న చర్చ ఉంది. చూడాలి మరి బీజేపీ రాష్ట్ర సారధుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో.