కొత్తగా కరోనా ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్.. రాష్ట్రంలో మరో 6 కేసులు

ఏపీలో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే ఆరుగురు కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు.

Update: 2026-07-23 08:02 GMT

ఏపీలో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే ఆరుగురు కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 32 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం ధృవీకరించింది. ఈ పరిణామంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో విశాఖపట్నంలో మూడు, రాజమహేంద్రవరంలో మూడు కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో వారం రోజులుగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తొలుత కడప జిల్లాల్లో వైరస్ లక్షణాలు బయటపడగా, వైద్యాధికారులు వైరస్ లక్షణాలను గుర్తించేందుకు పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు నమూనాలు పంపారు. వీటి ఫలితాలు తాజాగా అందాయని అంటున్నారు. కడప జిల్లాలో సేకరించిన నమూనాలలో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. గతంలో కరోనా సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

కడపలో అత్యధికం

జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆరు చొప్పున కేసులు ఉండగా, విశాఖపట్నంలో మూడు కేసులు నమోదయ్యాయి. కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండు చొప్పున కేసులు ఉండగా.. పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వారికి కరోనా నిర్ధారణకు ముందే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొంతమంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు, చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.

ప్రజలు కరోనా విషయంలో అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. అలాగే మాస్కులు, ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, చికిత్సకు అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచారు. టెస్టింగ్ కిట్లు, రెమ్‌డెసివిర్ ఔషధాన్ని స్థానికంగానే కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య సామగ్రిని వెంటనే కొనుగోలు చేసే అధికారాలను ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ప్రభుత్వం కల్పించింది.

Tags:    

Similar News