మమతను నందిగ్రామ్ పిలుస్తోంది !

ఇక 2026 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ తన సొంత స్థానం భవానీపూర్ నుండే పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె బిజెపి అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.

Update: 2026-09-07 23:30 GMT

నందిగ్రామ్ గుర్తుందా. పశ్చిమ బెంగాల్ లో రాజకీయంగా భీకర సమరానికి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అసలైన వేదికగా నిలిచింది. ఇక్కడ వేసవి ఎండలని మించి పొలిటికల్ హీట్ రేగిన సంగతి విధితమే. సీఎం, కాబోయే సీఎంల మధ్య రెండు సార్లు నందిగ్రామ్ జనాలు ఓటెత్తితే ఆ రెండు సార్లూ బీజేపీకి చెందిన ప్రస్తుతం సీఎం గతంలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారికే జై కొట్టింది. అలా నందిగ్రామ్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారాన్ని అందుకున్న మమత మీద ఎలాంటి మమతా లేదని స్పష్టంగా చాటి చెప్పింది. ఇక 2021లో మమత ఇక్కడ నుంచి ఓటమి చెంది భవానీపూర్ ని ఎంచుకుని ఉప ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. 2026 మేలో జరిగిన ఎన్నికల్లో భవానీపూర్ నుంచే మమత సీఎం గా పోటీ చేస్తే అక్కడికి కూడా సువేందు అధికారి వచ్చి మమతను ఓడించారు. అలా నందిగ్రామ్ భవానీపూర్ లలో ఆయన నందిగ్రామ్ వదిలేశారు. దాంతో ఇపుడు నందిగ్రామ్ కి ఉప ఎన్నిక వచ్చింది.

ఉన్న సీటు పోయి కూడా :

నిజానికి నందిగ్రామ్ అసెంబ్లీ సీటు మమతా బెనర్జీ సొంత సీటు కాదు, ఆమెది భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఆమె అక్కడ నుంచే 2011లో మొదటిసారి పోటీ చేసి విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 2016 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఇదే భవానీపూర్ స్థానం నుండి ఘన విజయం సాధించారు. అయితే 2021 ఎన్నికలలో మమత తన పాత స్థానాన్ని వదిలిపెట్టి, సువేందు అధికారితో పోటీ పడటానికి నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అలా అక్కడే మమత తప్పు చేశారు అని అంటారు. అయితే ఆ ఎన్నికల్లో మమత స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి ఆమె భవానీపూర్ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి, అక్కడ జరిగిన ఉపఎన్నికలో రికార్డు మెజారిటీతో మళ్లీ గెలిచారు. ఇక 2026 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ తన సొంత స్థానం భవానీపూర్ నుండే పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె బిజెపి అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఒక్కసారీ గెలవని మమత :

అయితే మమతను ఓడించడానికిఏ సువేందు అధికారి చివరి నిముషంలో భవానీపూర్ కి వచ్చి పోటీ చేసి మరీ ఆమెను పరాజయం పాలు చేశారు. అలా మమత సొంత సీట్లో ఆయన పాగా వేశారు. ఇక మమత తన జీవితంలో ఎన్నడూ గెలవని బీజేపీకి గట్టి పట్టు ఉన్న నందిగ్రామ్ సీటుని వదిలేశారు. ఇపుడు అక్కడ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మరి మమత ఇపుడు మాజీ సీఎం మాత్రమే కాదు మాజీ ఎమ్మెల్యే కూడా. ఆమె అసెంబ్లీకి వెళ్లాలి అంటే కచ్చితంగా ఉప ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇది ఆమె రాజకీయ జీవితానికి ఒక సవాల్ కూడా. ఎందుకంటే ఆమె ఇంతకు ముందు గెలవని సీటు. అదే సమయంలో బీజేపీకి అనుకూలించే ప్రాంతం. పైగా బీజేపీ బెంగాల్ లో అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి తాను పోటీ చేసి గెలిచి వదిలేసిన సీటుని తప్పకుండా నిలబెట్టుకుంటారు. అది ప్రెస్టేజ్ కూడా. ఒక మామూలు నేతగా ఉన్నప్పుడే సువేందు అధికారి చేతిలో మమత రెండు సార్లు ఓడారు, ఇపుడు ఆయన సీఎం గా ఉన్నారు. దాంతో మమతకు పోటీ అన్నది ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారుతోంది.

గెలిస్తే టైగర్ గానే :

ఇక తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా గడచిన నాలుగు నెలలుగా ఇబ్బందికరంగా తయారైంది. ఎంపీలు ఇరవై మంది దాకా చీలిపోయి వేరు పడ్డారు. సగానికి పైగా ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరంగా జరిగారు. దాంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అస్తిత్వానికే ముప్పు తెచ్చేలా సువేందు అధికారి పావులు కదుపుతున్నారు. దాంతో మమత పోటీ చేసి నందిగ్రామ్ సీటుని గెలుచుకుంటే మళ్ళీ బెంగాల్ టైగర్ అవుతారు. ఆమె రాజకీయానికి కూత్త ఊపిరి వస్తుంది. కేవలం నాలుగైదు నెలలకే బీజేపీ విఫలం అయింది అని జనంలో చెప్పినా విలువ ఉంటుంది. అలా కాకుండా ఆమె ఓటమి చెందితే పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ ఊబిలో కూరుకుపోయినట్లే. అంటే రిస్క్ తో కూడిన చాలెంజ్ గా నందిగ్రామ్ ఉప ఎన్నిక ఉంది అన్న మాట. మరి మమత తెగించి పోటీ చేసి జనం మద్దతు అందుకుంటారో లేక వద్దు అనుకుని సైలెంట్ అవుతారో చూడాలి. ఆమె కనుక నందిగ్రామ్ వద్దు అనుకుంటే మళ్ళీ 2029 ఎంపీ ఎన్నికల దాకా చాన్స్ రాదు, సో మమతను నందిగ్రామ్ పిలుస్తోంది. ఏం చేస్తారో మరి.

Tags:    

Similar News