యూట్యూబర్స్ ని నమ్మి ప్రజలు మోసపోతున్నారా?

చాలామంది యూట్యూబర్లు తమకు ఉన్న సబ్‌స్క్రైబర్ల బలాన్ని చూపిస్తూ ఆకర్షణీయమైన థంబ్‌నైల్స్, తప్పుడు ప్రకటనలతో అమాయకులను ఆకట్టుకుంటున్నారు.

Update: 2026-09-07 15:45 GMT

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజుల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు పెరిగిపోయారు. తమ రోజువారీ విశేషాలను వీడియోలుగా అప్‌లోడ్ చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. అయితే వీరి పాపులారిటీని ఆసరాగా చేసుకుని, ఫాలోవర్లను గుడ్డిగా నమ్మించి ఆర్థికంగా మోసం చేసే ఘటనావళులు రోజురోజుకూ ఎక్కువవుతున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా యూకే ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణలతో ఒక ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్:

లండన్‌లో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరుతో కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు అనే ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉండటంతో అధికారులు వెంటనే స్పందించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లండన్‌లో స్థిరపడిన నందన దంపతులపై, కుటుంబ సభ్యులపై గతంలోనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయనే వార్తలు ఒకవైపు వినిపిస్తున్న వేళ మరోవైపు భారత్‌కు తిరిగొస్తున్న సమయంలో ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం.

ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల దందా:

అసలు విషయంలోకి వెళ్తే.. యూకేలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు నందనపై ఆరోపణలతో ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. దాదాపు 100 మంది అమాయక బాధితులు వీరి చేతిలో మోసపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ యూట్యూబర్ నందన పై వస్తున్న ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. గతంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో కూడా నటించి క్రేజ్ సంపాదించిన ఈమె, ఆ పాపులారిటీని అడ్డుపెట్టుకుని ఇంత పెద్ద దందా నడుపుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

యూట్యూబ్‌లో రంగుల కలలు – గుడ్డి నమ్మకం:

చాలామంది యూట్యూబర్లు తమకు ఉన్న సబ్‌స్క్రైబర్ల బలాన్ని చూపిస్తూ ఆకర్షణీయమైన థంబ్‌నైల్స్, తప్పుడు ప్రకటనలతో అమాయకులను ఆకట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు, క్రిప్టోకరెన్సీలు, ఆన్‌లైన్ గేమింగ్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరిట దందాలు నడిపిస్తూ.. మోసపోయిన వారు తమ బాధను వెళ్ళబోసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారంటే.. వారు నిజాయితీపరులని భావించి, వారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మడమే ప్రజలు చేస్తున్న అతిపెద్ద పొరపాటు అని చెప్పవచ్చు.

మోసాల బారిన పడకుండా ఉండాలంటే?:

ఏ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పినా సరే.. ఉద్యోగాలు, పెట్టుబడులు, వీసాల విషయంలో కళ్ళు మూసుకుని నిర్ణయాలు తీసుకోకూడదు. డబ్బులు చెల్లించే ముందు సదరు సంస్థలకు సంబంధించిన పత్రాలు, వారి ఏజెన్సీల ప్రామాణికతను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు లేదా సులువైన ఉద్యోగాలు ఇస్తామంటే కచ్చితంగా అనుమానించాలి. అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే ఉద్యోగ ప్రకటనలను ధృవీకరించుకోవాలి.

సోషల్ మీడియా ప్రచారం చూసి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. యూట్యూబర్లు ఏది ప్రమోట్ చేసినా అది కేవలం ప్రకటన మాత్రమే తప్ప, దానికి ఎలాంటి గ్యారెంటీ ఉండదని గుర్తుంచుకోవాలి. ఇక అపరిచిత వ్యక్తులకు, నకిలీ ఏజెంట్లకు ముందూ వెనుకా ఆలోచించకుండా లక్షలాది రూపాయలు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దని నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News