వాట‌ర్ బాటిల్స్-ఉప్పు- చ‌క్కెర ప్యాకెట్ల‌లో మైక్రో ప్లాస్టిక్స్.. కోర్టులో FSSAI పిటిష‌న్

ఆహార ప్యాకెట్లపై ఇటువంటి హెచ్చరికలు వేయడం ద్వారా ప్రజల్లో అనవసర భయాందోళనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ తన రివ్యూ పిటిషన్‌లో ప్రధానంగా పేర్కొంది.

Update: 2026-09-07 11:25 GMT

బాటిల్ వాటర్, ప్యాకేజ్డ్ ఉప్పు, చక్కెర పదార్థాలపై మైక్రో‍‍‍, నానో ప్లాస్టిక్స్ ఉండే అవకాశం ఉందని ఎరుపు రంగు బోల్డ్ అక్షరాలతో హెచ్చరిక లేబుళ్లు ముద్రించాలని మద్రాస్ హైకోర్టు గతంలో ఒక కీలక ఉత్తర్వు జారీ చేసింది. అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా భారత ఆహార భద్రత ‍, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆహార ప్యాకెట్లపై ఇటువంటి హెచ్చరికలు వేయడం ద్వారా ప్రజల్లో అనవసర భయాందోళనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ తన రివ్యూ పిటిషన్‌లో ప్రధానంగా పేర్కొంది.

ఆహార పదార్థాలు, నీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్స్ ప్రభావంపై పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని.. అవి మానవ ఆరోగ్యానికి నేరుగా తీవ్ర హాని కలిగిస్తున్నాయని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశంలోనూ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్పత్తులపై ఇటువంటి ముందస్తు ప్రమాద హెచ్చరికల నిబంధన అమలులో లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సరైన ఆధారం లేకుండా ఇలాంటి నిబంధన తెస్తే వ్యాపార రంగానికి, సరఫరా వ్యవస్థకు పెద్ద ఆటంకం ఏర్పడుతుందని వివరించింది.

ఈ అంశంపై మరింత స్పష్టత సాధించేందుకు ఐసిఎమ్‌ఆర్, ఐఐటీ-మద్రాస్ వంటి ప్రముఖ పరిశోధనా సంస్థల ద్వారా సమగ్ర అధ్యయనం చేయించేందుకు తాము నిధులు సమకూరుస్తున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వెల్లడించింది. పరిశోధనల ఫలితాలు రాకుండానే హెచ్చరికలు ముద్రించడం ద్వారా దేశీయంగానే కాకుండా... విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల్లో కూడా ఆహార భద్రతపై ప్రతికూల భావన ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆహార పదార్థాలలో ఉండే ప్రతి చిన్న కాలుష్య కారకానికి లేదా భారీ లోహాల ఆధారాలకు లేబులింగ్ హెచ్చరికలు ఇస్తూ పోతే.. ప్యాకెట్ల నిండా కేవలం హెచ్చరికలే నిండిపోతాయని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వాదించింది. ఈ లేబులింగ్ విధానం ప్రాసెస్ చేసిన ఆహార వ్యాపారులకు తీవ్ర ఆర్థిక ‍‍‍‍‍‍, కార్యాచరణ భారంగా మారుతుందని... ఆచరణలో ఇది సాధ్యపడదని తన పిటిషన్‌లో గట్టిగా స్పష్టం చేసింది.

మొదట ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా తిరిగి మద్రాస్ హైకోర్టులోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ నిర్ణయించుకుంది. ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐతో పాటు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్లు కూడా ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని కోర్టును కోరాయి. శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా వెలువడే వరకు వ్యాపార వర్గాలు, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులను సవరించాలని ఈ పిటిషన్ల ద్వారా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News