అసెంబ్లీ ఫైట్ : కేటీఆర్ ను ఎత్తిపడేశారు.. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగారు.. టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో పాటు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Update: 2026-09-07 05:49 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో పాటు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.




ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. అయితే స్లోగన్స్‌తో ఉన్న టీషర్టులను ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కూడా హైడ్రామా నెలకొంది. కేటీఆర్ ను ఎత్తుకొని కారులోకి దింపే సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. కేటీఆర్‌ను పోలీసు వాహనంలోకి ఎక్కించే సమయంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీనిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డ ఆయన.. రేవంత్ రెడ్డికి ఇంతకు ఇంతా చెల్లిస్తామని హెచ్చరించారు.

ఇదే సమయంలో మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పోలీసుల తీరుకు నిరసనగా తన టీషర్ట్ విప్పేశారు. కేపీ వివేక్, సుధీర్ రెడ్డి కూడా టీషర్టులు విప్పినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితోనూ పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. తన చీరను పోలీసులు లాగారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురికాగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమెను ఓదార్చారు.

ఇక పోలీసులతో జరిగిన తోపులాటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాలికి గాయమైనట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందే చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించిన ఆయన.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News