అక్కడ కొత్త ఇంచార్జి...కళా తనయుడికి షాకేనా ?

నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనను అధినాయకత్వం ఎంపిక చేయడంతో కళా వారసుడికి షాకేనా అన్న చర్చ మొదలైంది.

Update: 2026-09-07 04:30 GMT

తెలుగుదేశం పార్టీకి విభజన ఏపీలో ఎక్కువ కాలం పాటు అధ్యక్షుడిగా పనిచేసిన వారు కిమిడి కళా వెంకట్రావు. ఆయన 1983లోనే టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. అంతే కాదు ఏకంగా హోం మంత్రి పదవిని ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి తొలిసారి అందుకున్న ఘనత ఆయనకే ఉంది. టీడీపీ నుంచి రాజ్యసభకు కూడా వెళ్ళిన చాన్స్ ఆయనకు ఇచ్చారు. నాలుగు దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉంటూ సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న కళా వెంకట్రావు 2024 ఎన్నికల్లో విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి దక్కుతుందంటే తొలిసారి గెలిచిన ఆ జిల్లా ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కి ఇచ్చారు. ఇక కళా తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు రాజకీయ భవిష్యత్తు మీదనే ప్రస్తుతం అంతా ఫోకస్ పెట్టారని అంటున్నారు.

ఎచ్చెర్ల నుంచి అంటూ :

కళా వెంకటరావు సొంత నియోజకవర్గం ఎచ్చెర్ల. దాంతో అక్కడ నుంచే ఆయన 2014లో గెలిచారు. 2019లో ఓడారు, 2024 లో కూడా పోటీకి చివరి దాకా ప్రయత్నం చేశారు. ఇక చీపురుపల్లి కి బదిలీ అన్నది తాత్కాలికం అని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఎక్కువగా ఎచ్చెర్ల రాజకీయాల మీదనే దృష్టి పెడుతూ వస్తున్నారు. 2029 ఎన్నికల్లో తమ వారసుడిగా కుమారుడిని అక్కడ బరిలోకి దించాలని చూస్తున్న క్రమంలో ఆ నియోజకవర్గం ఇంచార్జి పదవి ఇన్నాళ్లకు భర్తీ చేశారు. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న ఈ ఇంచార్జి పదవిలో తన కుమారుడికి చాన్స్ వస్తుందని కళా ఆశలు పెట్టుకున్నారు అని ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఎచ్చెర్ల కొత్త ఇంచార్జిగా లంక శ్యామలరావుని పార్టీ నియమించింది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనను అధినాయకత్వం ఎంపిక చేయడంతో కళా వారసుడికి షాకేనా అన్న చర్చ మొదలైంది.

అనుచరుడికే అవకాశం :

కొత్త ఇంచార్జి ఎవరో కాదు కళాకు అనుచరుడే అని అంటున్నారు. ఆయన సర్పంచ్ గా గతంలో పనిచేశారు. రణస్థలం మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు ఏకంగా నియోజకవర్గం ఇంచార్జి పదవి దక్కింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అవుతారు అన్నది సహజంగానే వినిపిస్తున్న మాట. మరి సొంత ఇలాకాలో కళా వారసుడికి ఇంచార్జి పదవి ఎందుకు దక్కలేదు అన్న చర్చ సాగుతోంది. ఇక శ్యామలరావు పార్టీ పగ్గాలు అందుకున్న క్రమంలో కళా వారసుడికి ఒక్కటే మార్గం ఉంది అని అంటున్నారు. చీపురుపల్లి నుంచే ఆయన తండ్రి స్థానంలో 2029 లో పోటీ చేయడం అని అంటున్నారు. అయితే అక్కడ కిమిడి నాగార్జున ఉన్నారు. ఆయన విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో ఆయనే చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. 2024లో కూడా చివరి నిముషంలో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. 2029 మీద గట్టి ఆశలనే నాగార్జున పెట్టుకున్నారు. మొత్తం మీద చూస్తే కళా ఫ్యామిలీకి సొంత ఇలాకా అయినా ఎచ్చెర్లలో కొత్త రాజకీయం కొత్త నాయకత్వం రావడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.

Tags:    

Similar News