కేసీఆర్ సారూ...మీరు సభకు రావద్దు !
బీఆర్ఎస్ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అసెంబ్లీకి రావద్దు అని వారు స్పష్టంగా చెప్పేశారు.
బీఆర్ఎస్ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అసెంబ్లీకి రావద్దు అని వారు స్పష్టంగా చెప్పేశారు. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు అని గద్దిస్తూ లేటెస్ట్ గా నిర్వహించిన సభలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎంత జీతభత్యాలు అందుకుంటున్నారో కూడా జనాలకు చెప్పారు. 22 కోట్ల దాకా జీత భత్యాలు ఇతర సదుపాయాలు అన్నీ కలుపుకుని అక్షరాలా 122 కోట్ల దాకా కేసీఆర్ కి ఈ వేయి రోజుల కాంగ్రెస్ పాలనలో చెల్లించామని లెక్కలన్నీ పక్కాగా చదివి వినిపించారు. అసలు కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ కేసీఆర్ సభకు దూరం కావడమేంటని గుస్సా అయ్యారు. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినా సభకు వస్తారా రారా అన్నది ఒక చర్చ అయితే అసలు కేసీఆర్ సార్ సభకు రావాల్సిన అవసరమే లేదని ఏకంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలే చెప్పడం విశేషం.
కౌరవ సభ అని :
రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగే శాసన సభ కౌరవ సభ అని కూడా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అందువల్ల అలాంటి సభకు కేసీఆర్ రావాల్సిన అవసరమే లేదని కారు సార్ కి గట్టిగానే చెప్పారు. మేము చాలు అని కూడా భరోసా ఇచ్చారు. సభలో మేము ప్రజా సమస్యలు అన్నింటి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ బాస్ కి భరోసా ఇచ్చారు. దాంతో కేసీఆర్ వర్షాకాల సమావేశాలకు రారు అన్నది పక్కా క్లారిటీ. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభలో ఎలా వ్యవహరించాలో కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేశారు. మొత్తం ఇరవై అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా నిర్ణయించారు అని తెలుస్తోంది.
జనంలోకి కేసీఅర్ ;
అయితే సభకు రానవసరం లేదని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన భరోసాతో కేసీఆర్ గేర్ మార్చి జనం బాట పట్టనున్నారు. ఆయన బస్సు యాత్ర చేస్తారు అని మొదట అనుకున్నారు. కానీ పాదయాత్ర చేస్తాను అని చెప్పడం విశేషం. ఏడు పదులు దాటిన కేసీఆర్ ఇపుడు తెలంగాణాలో లక్ష మంది జనాలతో కాళేశ్వరం ప్రాజెక్టు దాకా పాదయాత్ర చేయాలని నిర్ణయించడం విశేషం. అంతే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రత్యక్ష పోరాటం చేయాలని కూడా ఆయన నిర్ణయించడం మరో విశేషం. తెలంగాణాలో సాగు నీటి ప్రాజెక్టుల మీదనే తన పోరాటం మొదలవుతుందని ఆయన చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ ప్రత్యక్ష పోరాటానికి గులాబీ బాస్ రెడీ అవుతున్నారు.
అసెంబ్లీ లోపలా బయటా :
ఇక మూడేళ్లు రేవంత్ రెడ్డి పాలన పూర్తి చేసుకోవడంతో తెలంగాణాలో బీఆర్ఎస్ రాజకీయ జోరు పెంచింది. 2028 ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉండడంతో ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా సాధ్యమైనంత తొందరలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఆయన పాదయాత్రతో పాటు ఆందోళనలు కూడా నిర్వహిస్తారని సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం మీద బహిరంగ సభలను కీలక జిల్లాలలో నిర్వహిస్తారని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి.