డాటర్ స్ట్రోక్...పొలిటికల్ డిక్షనరీలో కొత్త పేజి !

రాజకీయాల్లో ఎపుడూ సన్ స్ట్రోక్ అన్న పదం అందరికీ తెలుసు. కొడుకుల వల్ల రాజ్యాలు కూలిపోయి రాజకీయాలు చేతుల్లోంచి జారిపోయి పాతాళానికి పవర్ పడిపోయిన నేపథ్యం ఉంది.

Update: 2026-09-07 03:58 GMT

రాజకీయాల్లో ఎపుడూ సన్ స్ట్రోక్ అన్న పదం అందరికీ తెలుసు. కొడుకుల వల్ల రాజ్యాలు కూలిపోయి రాజకీయాలు చేతుల్లోంచి జారిపోయి పాతాళానికి పవర్ పడిపోయిన నేపథ్యం ఉంది. భారత రాజకీయాలో దానికి సంబంధించి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. సన్ స్ట్రోక్ మీద దేశ రాజకీయాల్లో బోలెడు పేజీలు కూడా కేటాయించారు. అంతటి కధలు కనిపిస్తాయి. కుమార రత్నం మీద ప్రేమతో తమ ఉద్యోగాలకు ఉరి వేసుకుని ఉరి తీసుకున్న నాన్నలు అమ్మలు ఎంతో మంది కనిపిస్తారు. పుత్ర ప్రేమకు అచ్చమైన ఉదాహరణ మహా భారతంలో దృతరాష్ట్రుడు. ఆయన మితిమీరిన వాత్సల్యంతో దుర్యోధనుడిని గారాబు చేసిన వైనం చివరికి కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసింది. ఆనాడే కుమారుడిని అదిలించి బెదిరించి ఉంటే అంత పెద్ద యుద్ధమూ ఉండేది కాదు, రాజ్యమూ నిలిచేది, నూరుగురు కుమారులూ బతికేవారు. పుత్ర శోకమూ తప్పేది. కానీ దృతరాష్ట్రుడు ఆ పని చేయలేదు కాబట్టే అయిదు వేల ఏళ్ళు గడచినా దృతరాష్ట్ర ప్రేమ అన్న ముతక సామెత అలా కొనసాగుతూ వస్తోంది.

వీరంతా ఆ కోవకే :

ఈ దేశాన్ని ఏలిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ 1977 ఎన్నికల్లో దారుణమైన ఓటమికి చిన్న కుమారుడు సంజయ్ గాంధీ దూకుడు పోకడలు కారణం అంటారు. అప్పట్లో తల్లి చాటుగా ఉంటూ అధికారం చలాయించింది ఆయనే అని కూడా చెబుతారు. అలా ఇందిరాగాంధీ వంటి వారు సన్ స్ట్రోక్ కి గురి అయి మూడేళ్ల పాటు అధికార వియోగాన్ని భరించారు. ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన మీదట ఆమె 1980లో తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఇది దేశంలో ఒక అతి ముఖ్యమైన సన్ స్ట్రోక్ కధగా చెప్పుకుంటారు. అంతే కాదు దేశంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చేసిన వారు తమ కుమారులకు పెత్తనం ఇచ్చి చివరికి ఏమీ కాకుండా పోయిన కధలూ ఉన్నాయి.

ప్రాంతీయ పోరులోనూ :

లాలూ ప్రసాద్ లాంటి ఆర్జేడీ అధినేతలకు కూడా సన్ స్ట్రోకులున్నాయి. పెద్ద కుమారుడు తండ్రితో విభేదించి వెళ్తే చిన్న కుమారుడుతో ఆర్జేడీ బండిని లాలూ నడిపిస్తున్నారు. ఇక తమిళ దిగ్గజం కరుణానిధికి కూడా సన్ స్ట్రోక్ బాగానే తగిలింది అని అంటారు. ఆయన పెద్ద కుమారుడు అళగిరి చిన్న కుమారుడు స్టాలిన్ కి మధ్య పోరులో 2016లో ఎన్నికల్లో ఓటమి ఎదురైంది అని చెబుతారు. కర్ణాటకలో దేవేగౌడ ఇద్దరు కుమారులతో జేడీఎస్ ని నడుపుతూ ఒడిదుడుకుల పాలు అవుతున్నారు. ఒక దశలో ప్రత్యర్థి వరగంలో పెద్ద కుమారుడు చేతులు కలిపే దాకా సీన్ వెళ్ళింది. తెలుగు నాట కూడా కుమార రత్నాల రాకతో తండ్రుల రాజకీయ ప్రభ మసకబారిన ఉదంతాలు పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ దాకా కనిపిస్తాయి.

కూతురే పాతరేస్తే :

అయితే కుమారులు వారసులుగా ఆది నుంచి చెప్పుకుంటూ గర్వంగా నిలబడుతూ తండ్రుల తల్లుల రాజకీయ అడుగులకు అడ్డు పడడం అంతా చూశారు. కానీ కూతుళ్లు మాత్రం మెత్తగా ఉంటూ బుద్ధిగా మసలుకుంటూ కన్న వారి క్షేమమే చూస్తారు అని అనుకుంటూ ఉంటారు. అది కాదు అన్నట్లుగా మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ నిరూపించింది అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో మెంబర్ షిప్ లేకుండానే కేబినెట్ లో తన తల్లిని బర్త్ చేయించింది అని అంటున్నారు. తాను అన్న మాటలకు తన తల్లిని బలి చేస్తారా తాపీగా ఆమె ఏడుపు లంకించుకున్నా కూడా వినే వారు ఎవరు అన్నదే ప్రశ్న. తల్లికి పదవి ప్రస్తుతానికి ఉంది. తన రాజకీయానికి ఇంకా బోలెడు టైం ఉంది, ఇంతలో ఎందుకింత రభస అని ఆమె ఒక్క క్షణం అనుకుని ఉంటే కొండా సురేఖ మంత్రి పదవి నిలబడేది. బర్తరఫ్ పేరుతో పెద్ద అవమానం కూడా తప్పేది. కానీ అలా జరగలేదు, మా అమ్మకేమి తెలియదు అని కుమార్తె కన్నీళ్ళు ఏడ్చి వగచి వాపోయినా ఫలితం ఏముంది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ నేతలకు సన్ స్ట్రోక్స్ మాత్రమే కాదు డాటర్స్ స్ట్రోక్ స్ కూడా ఘాటుగానే ఉంటాయని లేటెస్ట్ ఉదంతం చెబుతోంది. కాబట్టి నాయకురాలా జర భద్రం అంటోంది రాజకీయం.

Tags:    

Similar News