సచివాలయ ఉద్యోగులకు వైసీపీ మద్దతు...కూటమి రియాక్షన్ ?
ఏపీలో సచివాలయ వ్యవస్థను వైసీపీ హయాంలో ఏర్పాటు చేశారు. మొత్తం లక్షా ముప్పై ఆరు వేల మంది దాకా అందులో చేరారు.
ఏపీలో సచివాలయ వ్యవస్థను వైసీపీ హయాంలో ఏర్పాటు చేశారు. మొత్తం లక్షా ముప్పై ఆరు వేల మంది దాకా అందులో చేరారు. ఇక వైసీపీ ప్రభుత్వంలోనే వారికి తరువాత కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావడంతో పాటు కూటమి ప్రభుత్వం వస్తే తమకు మరింత అర్ధిక ఉద్యోగ భరోసా దక్కుతుందని భావించి 2024 ఎన్నికల్లో కూటమికి ఓటెత్తారు. అయితే రెండేళ్ళు గడచిపోయాయి కానీ సచివాయల ఉద్యోగుల జీతాలలో తేడా లేదు, పని భారం కూడా ఎక్కువ అయింది అని ఆవేదన చెందుతున్నారు. దాంతో ఏపీలో తొలిసారిగా ఉమ్మడి విశాఖ నుంచే సచివాలయ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద సమర శంఖం పూరించారు. సరిగ్గా అనూహ్యంగా వారికి వైసీపీ నుంచి మద్దతు లభించింది. మీ పోరాటాలకు మేము అండ అంటూ వైసీపీ ముందుకు వచ్చింది.
వైసీపీ మాసన పుత్రికగా :
అయితే వైసీపీ తన మాసన పుత్రికగా చెప్పుకోవడం వల్లనే సచివాలయ ఉద్యోగుల విషయంలో కొంత ఉదాశీనత కూటమిలో ఉందని అంటారు, ఇపుడు వారికి వైసీపీ నేరుగా మద్దతు ఇస్తే కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఒక చర్చ అయితే న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అవుతాయా అన్నది మరో చర్చగా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం వివిధ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు చేస్తున్న ఆందోళనకు లేటెస్ట్ గా వైసీపీ మద్దతు తెలిపింది. వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. సచివాలయం ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సచివాలయం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిని రోడ్డుకి ఎక్కించే పరిస్థితి తీసుకురావడం చాలా బాధాకరమని విశాఖ జిల్లా వైసీపీ పేర్కొంటోంది.
మేము ఉద్యోగాలు ఇచ్చాం :
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను వారి ఇంటి ముంగిటకే చేర్చాలనే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలా సుమారు లక్షా ఆరు వేల మంది యువతకు ఎటువంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తమదని చెప్పుకున్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా ఈ నియామకాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వేలాదిగా ఉద్యోగులు గత మూడు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని వైసీపీ గుర్తు చేస్తోంది. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ కరోనా వంటి అత్యంత క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దారుణం అని వైసీపీ నేతలు మండిపడ్డారు.
డిమాండ్లు తీర్చాల్సిందే :
ఇదిలా ఉంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని వైసీపీ అంటోంది. ప్రభుత్వాలు మారుతాయని కానీ ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వతంగా ప్రజలకు సేవలందిస్తారని గుర్తు చేస్తోంది. ఉద్యోగుల వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేస్తోంది. సచివాలయ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి మానుకుని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. 15(2) నోషనల్ ఇంక్రిమెంట్లు ఐఎస్ ఏఏఎస్ అమలు ప్రొబేషన్ ఆలస్యానికి సంబంధించిన ఎరియర్స్ వార్షిక ఇంక్రిమెంట్, కనీస మూలవేతనం 30 వేల రూపాయలుగాగా నిర్ణయించడం, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు జీఓ ఎం ఎస్ నెం.11 రద్దు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు సత్వర ప్రయోజనాలు, కారుణ్య నియామకాలు తదితర అన్ని డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తొంది. మరి కూటమి ఈ డిమాండ్లు తీరుస్తుందా లేక ఏపీవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ఆందోళన స్టార్ట్ అవుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.