రాహులే ప్రధాని అభ్యర్థి...కాంగ్రెస్ కి ఏమిటీ కష్టం ?
గాంధీల ఐదో తరం వారసుడికి ఎంత కష్టం వచ్చి పడింది. వరుసగా మూడు ఎన్నికల నుంచి కాంగ్రెస్ వంద మార్క్ ఎంపీలను చేరుకోవడం లేదు.
గాంధీల ఐదో తరం వారసుడికి ఎంత కష్టం వచ్చి పడింది. వరుసగా మూడు ఎన్నికల నుంచి కాంగ్రెస్ వంద మార్క్ ఎంపీలను చేరుకోవడం లేదు. అంతే కాదు రాహుల్ గాంధీ ఎంపీగా మాత్రమే పాతికేళ్ళ రాజకీయ జీవితం మొత్తంలో మిగిలారు. మరో మూడేళ్ల అంటే 2029 లో జరిగే లోక్ సభ ఎన్నికల నాటికి అరవై ఏళ్ళ వయసులో రాహుల్ ఉంటారు. అప్పటికీ ఆయన ప్రధాని అని దేశమంతా అనడానికి ఎన్నికల్లో తీర్పు కావాలి. దాని కంటే ముందు ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్ధి అని చెప్పడానికి కూడా ఎన్ని అడ్డంకులు మరెన్ని
అడ్డు పుల్లలు ఉంటాయో. ఏంటో ఒక్కసారి ఇదంతా చూస్తూంటే కాంగ్రెస్ కి ఎంత కష్టం అని అనిపించక మానదు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిగా ఇండియా కూటమి తరఫున ఉంటారు అని ఒకటికి పదిసార్లు బల్ల గుద్ది మరీ కాంగ్రెస్ పెద్దలు చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తోంది అన్నదే పెద్ద చర్చ.
విజయ్ కాదు అంటూ :
లేటెస్ట్ గా చూస్తే కాంగ్రెస్ లో అత్యంత కీలక నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇండియా కూటమి తరఫున ప్రధాని రాహుల్ గాంధీయే అని గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఆయన ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విధంగా చాలా బలంగా చెప్పాల్సి వచ్చింది. దానికి కారణం తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని అభ్యర్థి అంటూ టీవీకే నుంచి విపరీతమైన ప్రచారం సాగడమే. ఇండియా కూటమి తరఫున విజయ్ ని ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నారా అని సూటిగా కేసీ వేణుగోపాల్ నే మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ అలాంటిది ఏమీ లేదని ఈ తరహా కధనాలలో నిజాలు లేవని వివరణ ఇచ్చారు. టీవీకే నుంచి అలాంటి డిమాండ్ కూడా లేదని స్పష్టం చేయడమే కాదు ఎవరూ ఇలాంటి గందరగోళ పరిస్థితి సృష్టించవద్దు అని చెప్పారు. ఇండియా కూటమి ముఖ చిత్రంగా రాహుల్ గాంధీ ఉంటారు, ఆయనే నాయకత్వం వహిస్తారు అని చెప్పారు.
టీవీకే హడావుడి :
గందరగోళం సృష్టించవద్దు అని మీడియాను కేసీ వేణుగోపాల్ కోరడం ఓకే కానీ నిజానికి ఈ గందరగోళం అయోమయం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నది కాంగ్రెస్ పెద్దలకు తెలియదా అని అంటున్నారు. టీవీకే నాయకులు మంత్రులు వీరంతా కదా విజయ్ తదుపరి ప్రధాని అని అంటోంది. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నది, ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నది అని అంటున్నారు. మరి కాంగ్రెస్ మాత్రం అలాంటిది ఏమీ లేదని రాహుల్ నాయకత్వమే ఇండియా కూటమి కోరుకుంటోంది అని అంటున్నారు. ఇక ఇండియా కూటమిలో చూసుకున్నా ప్రధాని పదవి మీద ఆశ లేని నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే జవాబు వస్తుంది. ఈ రోజుకి బెంగాల్ లో ఓడి కాస్తా తగ్గినట్లు కనిపించినా 2029 ఎన్నికల్లో ఎక్కువ లోక్ సభ సీట్లు గెలుచుకుంటె కచ్చితంగా మమతా బెనర్జీ ప్రధాని పీఠానికే గురి పెట్టరు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని అంటున్నారు.
కేజ్రీవాల్ సైతం :
అలాగే పంజాబ్ ఢిల్లీ రాష్ట్రాలలో ఆప్ ఎంపీలు ఎక్కువగా గెలిస్తే కేజ్రీవాల్ సైతం ప్రధానిగా రెడీ అంటారని కూడా చెబుతున్నారు. 2027లో యూపీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయితే సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా 2029 నాటికి ప్రధాని పదవి రేసులో ఇండియా కూటమి తరఫున ఉండరని ఎలా అనుకుంటారు అని అంటున్నారు. ఇలా ఏతా వాతా చూస్తే కనుక రాహుల్ గాంధీకి ముందు ఇండియా కూటమి ఇంటి నుంచే సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమి అంతా కూర్చుని మా ప్రధాని అభ్యర్ధి రాహుల్ అని ముక్తకంఠంతో చెబితే ఆ మీదట దేశ ప్రజల తీర్పు కోసం వెళ్లొచ్చు అని కూడా ఎన్డీయే నుంచి సెటైర్లు పడుతున్నాయంటే కాంగ్రెస్ భావి నాయకుడికి ప్రధాని పీఠానికి మధ్య దూరమెంత అన్నది అర్ధమైపోతోంది కదా అన్నదే అందరి మాట.