విజయసాయిరెడ్డి బోర్ ప్రెస్మీట్.. పార్టీపై సస్పెన్స్ కంటిన్యూ!

మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటనపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2026-09-07 09:50 GMT

మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటనపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెలలో తిరుమల దర్శనానికి వెళ్లిన ఆయన కొత్త పార్టీపై విజయవాడలో మీడియా సమక్షంలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. చెప్పినట్లుగానే సోమవారం విజయవాడలో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో తాను పార్టీ పెడుతున్న పాత విషయాన్నే చెప్పారు కానీ, ఆ పార్టీ పేరు? జెండా? ఎలా ఉంటాయో మాత్రం చెప్పలేదు. ఇక మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తానని చెబుతూ తన పార్టీ అజెండాగా ఐదు అంశాలు ఉంటాయని వెల్లడించారు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ పేరు ఏంటి? ఆయన పార్టీలో ఎవరు చేరుతున్నారు? జెండా ఎలా ఉంటుంది? అన్న విషయాలపై క్లారిటీ వస్తుందని పరిశీలకులు ఎదురుచూశారు. కానీ, సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి ఆయా అంశాల జోలికి వెళ్లకపోవడంపై అంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షంపై తన పాత విమర్శలతోనే విజయసాయిరెడ్డి కాలం గడిపేశారని పెదవి విరుస్తున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ పేరు ఎలా ఉంటుంది? ఆయన టార్గెట్ ఏంటి? అన్న అంశాలపై స్పష్టత వస్తుందని మీడియా సమావేశం ముందు అంతా ఎదురుచూశారు. కానీ, తన ప్రెస్మీటులో ఎలాంటి సంచలనం లేకుండానే విజయసాయిరెడ్డి ముగించడమే చర్చనీయాంశంగా మారింది.

పార్టీ పెడతానంటూ ఇప్పటికే ప్రకటన చేసిన విజయసాయిరెడ్డి.. పార్టీ పేరు ప్రకటనపై తర్జనభర్జన పడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదు అంశాల అజెండాపై స్పష్టమైన ప్రకటన చేసిన ఆయన పార్టీ పేరు విషయంలో తన ఆలోచన మాత్రం బయటపెట్టకపోవడం అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన పార్టీలు మాదిరిగా కాకుండా, తన పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా తాను ఉండనంటూ విజయసాయిరెడ్డి చెప్పడమే ఈ రోజు ప్రెస్మీటులో విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక వైసీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన విజయసాయిరెడ్డి సొంత పార్టీ ప్రకటన తర్వాత ఆయనతో ఎవరు కలవనున్నారు? అనే ప్రశ్న ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు విజయసాయిరెడ్డికి మద్దతుగా ఏ నేత బయటపడలేదు. దీంతో విజయవాడ వేదికగా ఈ సస్పెన్స్ ను ఆయన రివీల్ చేస్తారని ఎదురుచూశారు. కానీ, తనది ప్రస్తుతానికి ఒంటరి పోరాటంగానే విజయసాయిరెడ్డి సంకేతాలిచ్చారని విశ్లేషిస్తున్నారు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరితో చర్చించింది? ఎవరెవరిని సంప్రదించింది మాత్రం చెప్పలేదని అంటున్నారు. దీంతో అసలు విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 

Tags:    

Similar News