రాజకీయాలపై విశాఖ ఎంపీ భరత్ షాకింగ్ కామెంట్స్.. రెండేళ్లలోనే ఇంత నిర్వేదమా?!

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుడిగా సినీ నటుడు బాలయ్య అల్లుడిగా మంత్రి లోకేశ్ తోడల్లుడిగా భరత్ ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకస్థానంలో ఉన్నారు

Update: 2026-09-07 11:24 GMT

రాజకీయాలపై విశాఖ ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుడిగా సినీ నటుడు బాలయ్య అల్లుడిగా మంత్రి లోకేశ్ తోడల్లుడిగా భరత్ ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకస్థానంలో ఉన్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండేళ్లుగా ప్రభుత్వంలో క్రియాశీలంగా పనిచేస్తున్న ఆయన ఇప్పుడు ఆకస్మాత్తుగా రాజకీయాలపై తనకు ఇంట్రెస్ట్ పోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా రాజకీయాల్లోకి వస్తామని ఎవరైనా అనుకుంటే ముందుగా జాగ్రత్తగా ఆలోచించుకోవాలని ఎంపీ భరత్ సలహా ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు సరిగా లేవని వ్యాఖ్యానించారు. నేను పార్టీ లోపలికి వద్దాం అనుకుంటున్నాను, పార్టీ కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను అని ఒకరు తనను మొదటిసారి కలిస్తే నేను ఎంకరేజ్ చేయలేదని భరత్ వెల్లడించారు. రాజకీయాలు, సమాజం పాడైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. 40, 50 ఏళ్ల క్రితం సమాజం కోసం ఏదో చేయాలన్న భావనతో రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్టీఆర్ హయాంలో ఇలా రాజకీయాల్లోకి వచ్చిన వారు అంకితభావంతో పనిచేశారని అభినందించారు. కానీ, గత పది, ఇరవైయేళ్లలో రాజకీయాల్లో పూర్తిగా మార్పు వచ్చిందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

సేవ చేయాలని అన్న ఆలోచన కన్నా రాజకీయాలలోకి వచ్చి పార్టీలోనో ప్రభుత్వంలోనో ఒక స్థానం వస్తే తద్వారా మనం ఎట్లా సంపాదించుకోవాలి? లేకపోతే అధికారాన్ని ఎట్లా చలామణి చేయాలని ఆలోచనే ఎక్కువ మందిలో కనిపిస్తోందని ఎంపీ తెలిపారు. అందుకే రాజకీయాలపై పార్టీలో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో సుఖం ఉండదని అన్నారు. మామూలుగా ఏదైనా కంపెనీలో బాగా పనిచేస్తే జీతం పెరుగుతుంది, లేకపోతే ప్రమోషన్ వస్తుంది. కానీ, రాజకీయాల్లో బాగా పనిచేస్తే తిట్లు ఎక్కువొస్తాయని చమత్కరించారు.

ఇలాంటి జీవితం మీరు కోరుకుంటున్నారా? అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లోకి వస్తామని, పార్టీ కోసం సేవ చేస్తామని ఓ కార్యకర్త తనకు చెప్పారని, దుబాయ్ లో ఉద్యోగం చేసిన వారు ఇక్కడ సమాజ సేవ చేస్తామంటే ముందుగా ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. ‘‘అక్కడ ప్రపంచం వేరు, ఇక్కడ ప్రపంచం వేరు. డబ్బు, సంపాదన లేకుండా రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ఆదాయం సంపాదించే మార్గం వదిలేసి ప్రజలమీద పడతామంటే ఎలా? అంటూ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ వ్యవస్థ ఎట్లా కుళ్ళిపోయింది అంటే మంచివాళ్ళు కూడా పాడైపోతున్నారు. చాలామంది ఒకప్పుడు మంచి ఆలోచనలతో వచ్చినవాళ్ళు కూడా దీంట్లో బతకాలి అంటే పాడైపోతున్నారు.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవాళ రాజకీయం మంచి, చెడు మధ్యలో జరగట్లేదు. చెడు, దరిద్రం మధ్యలో నడుస్తోంది. ఎవరు తక్కువ చెడ్డవాళ్ళో చూసుకోవాల్సివస్తోందని అన్నారు. అదే సమయంలో నిజాయితీపరులు, మంచివాళ్ళు రాజకీయంలో ఇప్పటికీ ఉన్నారు. కానీ అరుదుగా ఉంటున్నారని అన్నారు. చాలా బలంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడిలను తట్టుకొని నిలబడమంటేనే రాజకీయాల్లోకి రావాలని స్పష్టం చేశారు. కాగా, విశాఖ ఎంపీ భరత్ వ్యాఖ్యలు విస్తృత చర్చగా మారాయి. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలని ఆయన తోడల్లుడు, మంత్రి నారా లోకేశ్ పిలుపునిస్తుంటే, ఎంపీగా రెండేళ్ల అనుభవంతో అప్పుడై రాజకీయాలంటే ఇంట్రెస్టు లేదని భరత్ చెప్పడమే ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు తగినట్లే భరత్ మాట్లాడారని, ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్నవారు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, సమాజ హితం పట్టించుకోవడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి పాలిటిక్స్ నాట్ ఇంట్రెస్ట్ అంటూ భరత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.



Tags:    

Similar News