విజయసాయిరెడ్డి కొత్త పార్టీ....ఆ తానులో ముక్కేనా ?

రిజిస్టర్ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. గుర్తింపు పొందిన పార్టీలు అయితే చాలా ఉన్నా బలంగా ఉనికి చాటుకుని గట్టిగా నిలబడినవి మాత్రం అతి తక్కువగానే ఉన్నాయి. దానికి కారణాలు అనేకం ఉన్నాయి.

Update: 2026-09-07 15:48 GMT

రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు పార్టీ కూడా ఎవరైనా పెట్టొచ్చు అన్నారు బీజేపీకి చెందిన నాయకుడు కూటమి మంత్రి సత్య కుమార్ యాదవ్. ఆయన అన్నారని కాదు కానీ అదే నిజం. పాతికేళ్ళు నిండితే ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాజ్యాంగం ఇస్తుంది. అలాగే ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటే వారికి తగిన స్వేచ్చ ఉంది. అలాగే విజయసాయిరెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు. అయితే పార్టీ పెట్టడం వరకూ ఓకే కానీ దానిని జనంలోకి ఎలా తీసుకుని వెళ్లాలన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ రోజున దేశంలో అన్ రిజిస్టర్డ్ పార్టీలు వేలల్లో ఉన్నాయి. రిజిస్టర్ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. గుర్తింపు పొందిన పార్టీలు అయితే చాలా ఉన్నా బలంగా ఉనికి చాటుకుని గట్టిగా నిలబడినవి మాత్రం అతి తక్కువగానే ఉన్నాయి. దానికి కారణాలు అనేకం ఉన్నాయి.

నాయకుడితోనే అంతా :

భారత దేశ రాజకీయాల తీరు చూస్తే నాయకుడి చుట్టూనే పార్టీలు తిరుగుతూ ఉంటాయి. క్యాడర్ బేస్డ్ పార్టీలు సైతం లీడర్ షిప్ తోనే మనుగడ సాగిస్తున్నాయి. ఇమేజ్ ఉన్న వారితోనే పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. ఫిలాసఫీ మంచిగా ఉండొచ్చు కానీ పార్టీలకు జనాకర్షణ కలిగిన నాయకత్వం చాలా ముఖ్యం అని అంటున్నారు. లేకపోతే ఈ పాటికి సిద్ధాంత బలం క్యాడర్ బేస్ కలిగిన అనేక పార్టీలు దేశంలో ఏనాడో అధికారంలోకి వచ్చి ఉండేవని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఆయన దసరాకు తన పార్టీని ప్రకటిస్తాను అని అంటున్నారు. అంటే కచ్చితంగా మరో నలభై రోజులలో అన్న మాట. ఏపీలో కొత్త పార్టీ ఆ విధంగా పురుడు పోసుకుంటోంది.

రాజకీయ శూన్యత ఉందా :

ఇక భారత్ లాంటి దేశాలలో మరో సంప్రదాయమైన పరిణామ క్రమం ఏమిటి అంటే ఎపుడూ రెండు పార్టీల వ్యవస్థనే దేశంలో కానీ ప్రాంతీయంగా కానీ కొనసాగుతూ ఉంటుంది. ఆ రెండు రాజకీయ వ్యవస్థలలో ఒకటి కనుక తగ్గిపోయినా లేక క్షీణించినా అపుడు మరొకరికి చాన్స్ వస్తుంది. పేరుకు అనేక పార్టీలు ఉన్నా ప్రజల చూపు ఎపుడూ అధికార పక్షం ఆ పక్కనే బలమైన ప్రతిపక్షం మీద ఉంటుంది. ప్రజలు తమ ఓట్లను మురిగిపోరాదు అని ఆలోచిస్తారు. దాని కంటే ముందు ఓటర్లు కూడా మెజారిటీ ఆయా పార్టీలకు అభిమానులుగానో సానుభూతిపరులుగానో మారిపోయిన నేపథ్యం ఉంటోంది. అందుకే మెజారిటీ ఓట్ల షేర్ ఆయా పార్టీల వైపే ఉంటుంది. ఇక ఏపీలో చూస్తే మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు లెక్క. టీడీపీ వైసీపీ జనసేన కు బలమైన నాయకత్వం అలాగే క్యాడర్ కూడా ఉంది ఒక రెండు పార్టీల వ్యవస్థ గానే ఈ రోజుకీ ఏపీ పాలిటిక్స్ సాగుతోంది. జనసేన కూడా అధికార పీఠం వైపుగా వెళ్ళాలని చూస్తోంది. దాంతో ఎలా చూసుకున్నా ఏపీలో రాజకీయ శూన్యత అన్నది అయితే లేదనే అంటున్నారు.

ఆ పార్టీల సరసనేనా :

ఏపీలో ఇప్పటికే కొన్ని పార్టీలు ఉన్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు పార్టీ పెట్టారు. అలాగే మాజీ న్యాయమూర్తి ఒకరు పార్టీ పెట్టారు, అలాగే బీసీ నినాదంతో ఇంకో పార్టీ ఉంది. ఇవే కాకుండా ఆప్ వంటి పార్టీలు ఉన్నాయి, ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. మరి విజయసాయిరెడ్డి పార్టీ కూడా వీటి సరసన ఉంటుందా అంటే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏపీ రాజకీయాలు అంటే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య సాగుతుంది. సంకుల సమరంగా కూడా చూస్తారు. మూడు రీజియన్లు ఉన్నాయి, ఒక్కో చోట ఒక్కో విధమైన తీరున జనాభిప్రాయం ఉంటుంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతామని ముందుకు సాగుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News