‘‘అధారాలు లేకుండా ఫేక్ ప్రచారం ఏంటి?’’ - మెగా డీఎస్సీపై సంచలన వీడియోలు!

ప్రధానంగా డీఎస్సీపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కొత్తగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2026-09-07 13:00 GMT

రాష్ట్రంలో మెగా డీఎస్సీపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు లేవని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా కొన్ని మీడియా చానళ్లు హడావుడి చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా జర్నలిస్టులమని చెప్పుకుని కొందరు పాఠశాలల్లోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తూ కొత్త టీచర్లను బెదిరిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు రాని అభ్యర్థులను డిబేట్లకు పిలుస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా డీఎస్సీపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కొత్తగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెగా డీఎస్పీలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను బెదిరించేలా కొన్ని మీడియా చానళ్లు, జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అక్రమ మార్గాల్లో ఉద్యోగాల్లో చేరినట్లు ఉపాధ్యాయులతోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో మాజీ సైనిక ఉద్యోగికోటాలో ఉద్యోగం పొందిన ఒక ఉపాధ్యాయుడిపై ఒక మీడియా చానల్ జర్నలిస్టులు దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా మాజీ సైనిక ఉద్యోగి తనపై జరిగిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం సంచలనం అవుతోంది.

అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగికి ఉద్యోగం రాకపోయినా, అక్రమంగా టీచర్ పోస్టులో జాయిన్ అయ్యాడని ఒక మీడియా చానల్ లో మరో అభ్యర్థి ఆరోపించారని అంటున్నారు. దీనిపై ఆరోపణలు ఎదుర్కొన్న నిరుద్యోగి వీడియో విడుదల చేశాడు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తనకు ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం వచ్చిందని చెప్పడం ద్వారా కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆ నిరుద్యోగి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా మీడియాలో బాధ్యతరాహిత్యంతో కథనాలు ప్రసారం చేయడంపై మండిపడ్డారు.

మొత్తానికి డీఎస్పీ పై మీడియాలో హడావుడి చేయడంపై సోషల్ మీడియా ద్వారా ఎదురుదాడి ముమ్మరమైందని చెబుతున్నారు. నియామకాల్లో ఏదైనా అక్రమం జరిగిందని అనుమానం ఉంటే, ఆధారాలు, పత్రాలు, రికార్డులతో ప్రశ్నించాలి కానీ, తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేయడం సరికాదంటూ నిరుద్యోగులు చేస్తున్న ఎదురుదాడి చర్చకు దారితీస్తోందని అంటున్నారు. ఉద్యోగులను బెదిరించి, తమకు కావాల్సిన విధంగా మాట్లాడించాలని ఒత్తిడి చేయడం జర్నలిజం అవుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి, పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సాధించిన టీచర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎందుకు? అంటూ నిరుద్యోగులు వాపోతున్నారు. నిజంగా అక్రమాలు జరిగాయని నమ్మితే అందుకు తగిన ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎస్సీపై వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఉత్కంఠ ఎక్కువవుతోందని చెబుతున్నారు.

Tags:    

Similar News