ప్రధాని ఎవరనేది ఎన్నికల తర్వాతే....రాహుల్ కి సీపీఎం షాక్ !

అయితే అదే ఇండియా కూటమిలో ఉన్న కీలక మిత్ర పక్షం సీపీఎం అయితే కాంగ్రెస్ చేసిన ప్రకటన పక్కకు పెట్టేస్తూ ప్రధాని ఎవరన్న గొడవ ఇపుడు కానే కాదంటూ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

Update: 2026-09-07 21:08 GMT

అదేంటో కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని ఆశలకు నీళ్ళు చల్లేందుకు సొంత మిత్రులే సిద్ధంగా ఉన్నారు. తాను స్వయంగా మద్దతు ఇచ్చి సీఎం సీటుకు దారి చూపించి కూర్చోబెడితే టీవీకే అధినేత విజయ్ ఇపుడు ఏకంగా ప్రధాని రేసులోకి దూసుకుని వచ్చారు. కాబోయే ప్రధాని అని టీవీకే ఒక పక్క హడావుడి చేస్తోంది. దానిని సద్దుమణనీయడానికి కాంగ్రెస్ అగ్ర నేత కేసీ వేణు గోపాల్ రాహుల్ గాంధీయే ఇండియా కూటమి సారధి కాబోయే ప్రధాని అని చెప్పాల్సి వచ్చింది. అయితే అదే ఇండియా కూటమిలో ఉన్న కీలక మిత్ర పక్షం సీపీఎం అయితే కాంగ్రెస్ చేసిన ప్రకటన పక్కకు పెట్టేస్తూ ప్రధాని ఎవరన్న గొడవ ఇపుడు కానే కాదంటూ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

ముందు బీజేపీని ఓడించాలి :

విపక్షాలు అన్నీ కలిసికట్టుగా ఉండి ముందు బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మీదట ప్రధాని ఎవరు అన్నది చర్చకు వస్తుందని ఆయన స్పష్టంగానే చెప్పేశారు. ఎన్నికల ఫలితాల తరువాతనే ప్రధాని అభ్యర్ధిని అన్ని పార్టీలు కలసి నిర్ణయిస్తాయని సీపీఎం అగ్ర నేత చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ కి ఇబ్బందికరంగానే ఉంది అని అంటున్నారు. ప్రతిపక్షాలు అన్నీ ప్రధానిగా ఎవరు ఉండాలన్నది అప్పుడే పరిణతితో నిర్ణయం తీసుకుంటాయని కూడా బేబీ అన్నారు. మరిక్కడే కాంగ్రెస్ నేతలకి కొంత అసహనం వ్యక్తం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎలా అంటే పరిణతితో అన్న మాటను బేబీ వాడారు. అంటే ప్రధాని పదవి అన్నది అంత ఆషామాషీగా ఎంపిక చేసే వ్యవహారం కాదని ఆయన చెప్పకనే చెప్పారు అన్న మాట.

సీపీఏం ప్రకటించడం లేదు :

ఇక రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం లేదని కూడా సీపీఎం అగ్ర నేత అన్నారు. ఇక గతంలో జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ హయాంలో జ్యోతి బసు ప్రధాని పదవి అంశంపై పార్టీ సెంట్రల్ కమిటీలో జరిగిన చారిత్రక చర్చను ఆయన చెబుతూ ఆనాడు తమ పార్టీకి చాన్స్ వచ్చిన విషయం వివరించారు. అయితే 2029 లో తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా పోటీ పడేది ఉండదని ఆయన తేల్చి చెప్పారు. లోక్ సభలో ప్రస్తుతం రాహుల్ గాంధీ విపక్ష నేత కాబట్టి సహజంగా ఆయన కాబోయే ప్రధానిగా ప్రొజెక్ట్ కావచ్చు అని ఆయన అన్నారు. అయితే అంత మాత్రాన జరిగేది కాదని విపక్షాలు అన్నీ కలిసి కూర్చుని చర్చించిన మీదటనే ప్రధాని ఎవరో తేలుతుందని బేబీ స్పష్టం చేశారు.

ఊహాగానాలు వద్దంటూ :

ఇదే క్రమంలో ప్రధాని పదవి భవిష్యత్తు నాయకత్వం మీద ఊహాగానాలు వద్దు అని సీపీఎం అగ్ర నేత బేబీ పేర్కొనడం విశేషం. ముందు పని చాలా ఉంది అని ఆయన అంటున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించడమే విపక్షాల అజెండా కావాలని ఆయన కోరారు. విపక్షాల ఐక్యత ముఖ్యమని చెబుతూ నాయకత్వం ఎవరు వహిస్తారు అన్నది ఇపుడు ముఖ్యం కాదని కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిస్తే ఏమో కానీ ఇండియా కూటమితో కలసి జట్టు కట్టడం వల్ల రాహుల్ ప్రధాని అని నేరుగా గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉందని మిత్ర పక్షాల మాటల ద్వారా అర్థం అవుతోంది. మరి మోడీ అటు వైపు ఉంటే ఇవతల రాహుల్ గాంధీ ఫేస్ చూపించకపోతే ఇండియా కూటమికి రాజకీయ ఆకర్షణ ఎలా వస్తుంది అన్న ప్రశ్నలు కూడా కాంగ్రెస్ శిబిరం నుంచి ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News